దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం భారీ అల్పపీడనం కొనసాగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీక్రుతం అయి ఉంది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం దాదాపు అన్ని చోట్ల పొడిగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 


అల్పపీడన ప్రభావంతో మంగళవారం (డిసెంబర్ 20) నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగుతోంది.


‘‘ఇక వర్షాకాలం చివరి దశకి వచ్చేసింది కాబట్టి రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న రోజుల్లో శ్రీలంకకి దగ్గరగా వస్తున్న అల్పపీడనం వలన డిసెంబరు 22 నుంచి 28 మధ్య కాలంలో దక్షిణ భాగాలైన తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ వలన శ్రీలంక తీరం దగ్గరగా వచ్చి ఉత్తర దిశగా కదలనుంది. దీని వలన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయే కానీ భారీ వర్షాలుండవు. మిగిలిన జిల్లాలు, ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు ఏమి ఉండవు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తర కోస్తా, యానాం
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్ర
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


రాయలసీమ
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 14 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.