Delhi Political News:


ఆప్‌ అవినీతిలో కూరుకుపోయింది: భాజపా 


ఢిల్లీలోని భాజపా ఎమ్మెల్యేలంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు. ఆప్ సర్కార్‌ను రద్దు చేయాలని రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించనున్నారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తోందని భాజపా మండి పడుతోంది. డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతోంది. ఢిల్లీ ప్రజలు ఆప్‌ పాలనతో విసిగిపోయారని అంటోంది. మంత్రి సత్యేంద్ర జైన్‌ అవినీతికి పాల్పడి మూడు నెలల పాటు జైల్లో ఉన్నారని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాంటి మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తోంది. ఢిల్లీ భాజపా ఎమ్మెల్యేలంతా
విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్ర చేసి...రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మెమొరాండం సమర్పించనున్నట్టు ప్రతిపక్ష నేత రామ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఎక్సైజ్ పాలసీలో సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో...మరో స్కామ్‌ గురించి కూడా ప్రస్తావించారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC)లో రూ.3,200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ జైల్ బోర్డ్ (DJB)లోనూ రూ.58,000కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది భాజపా. 




ఎక్సైజ్ పాలసీ స్కామ్‌..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ఈ స్కామ్‌లో మనీష్ సిసోడియా హస్తం కూడా ఉందన్న కారణంగా కేసు నమోదు చేసినట్టు CBI వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై FIR నమోదైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఈ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న CBI..మొత్తం 15 మంది పేర్లు ఇందులో పొందుపరిచింది. అయితే అంతకు ముందు సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్టు వార్తలొచ్చాయి. దీనిపై సీబీఐ వివరణ ఇచ్చింది. ఈ వార్తల్ని ఖండించింది. ఆ తరావాతే...15 మందిపై కేసు నమోదు చేసింది. 
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సృష్టించిన అలజడి కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశమంతా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం స్కామ్‌లో తెరాసలోని పెద్దలు కీలక పాత్ర పోషించారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అటు..సీబీఐ ఈ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే..సిసోడియా గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.


పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీతప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్‌ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


Also Read: CM KCR : త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి, దేశ వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ - సీఎం కేసీఆర్