National Investigation Agency: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేస్తుండడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వారు వరంగల్, హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఈ తనిఖీలు (NIA Searches) చేస్తున్నారు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూ ప్రకాశ్ రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఈ సోదాలు నిర్వహించారు. అనిత ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి అధికారులు ఈరోజు (సెప్టెంబరు 5) తెల్లవారుజాము నుంచి అనిత ఇంట్లో తనిఖీలు జరుపుతున్నారు. ఇక ఈ తనిఖీలకు సంబంధించి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
సోదాలు (NIA Searches) జరుగుతుండగా, స్థానిక పోలీసులు అనిత ఇంటి చుట్టుపక్కల మోహరించారు. అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చూసుకున్నారు. అనిత సామాజిక కార్యకర్త. మహిళా చైతన్య కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తుంటారు. అయితే, ఆమెకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అనిత ఇంట్లో మూడు గంటల పాటు సోదాలు నిర్వహించాక మహిళల మ్యానిఫెస్టో, కొన్ని రకాల సాహిత్య పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఈ సోదాల అంశంపై అనిత స్పందించారు. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తాము సామాజిక రుగ్మతలపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. 6 నెలలకు ఓసారి మాత్రం తాము సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న పుస్తకాన్ని ఎన్ఐఏ అధికారులు తమతో పాటు తీసుకెళ్లారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు.
Also Read: Bigg Boss 6 Telugu: అదో బూతుల స్వర్గం: నారాయణ - బిగ్ బాస్‌పై ఘాటు పదాలతో మళ్లీ విమర్శలు
హైదరాబాద్ లోనూ.. (Hyderabad NIA Searches)
హైదరాబాద్ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం (Chaitanya Mahila Sangham) కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు జూన్‌లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలు, సికింద్రాబాద్‌లోనూ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. హైకోర్టు న్యాయవాది చుక్కా శిల్ప, దేవేంద్ర, స్వప్నలను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
విద్యార్థిని రాధ మావోయిస్టుల్లో చేరేందుకు ఈ నిందితుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రాధను చైతన్య మహిళా సంఘం నేతలు కిడ్నాప్ చేశారని రాధ తల్లి గతంలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ రిక్రూట్‌మెంట్ కేసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లాలో కూడా ఎన్‌ఐఏ అధికారుల తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Ganesh Nimajjan: గణేష్ నిమజ్జన డేట్‌పై ఉత్సవ సమితి క్లారిటీ - సర్కార్‌కు వార్నింగ్, రేపు బైక్ ర్యాలీ