బిగ్ బాస్ కార్యక్రమాన్ని తరచూ విభేదిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వార్తల్లో నిలుస్తుంటారు. బిగ్ బాస్ మొదలైన సీజన్ - 1 నుంచి గత ఐదో సీజన్ వరకూ కార్యక్రమం మొదలైన ప్రతిసారి విమర్శలు చేస్తూ వచ్చారు. ఐదో సీజన్ ప్రారంభం సందర్భంగా ఏకంగా బిగ్ బాస్ హౌస్‌ ను బ్రోకర్ హౌస్ అంటూ అభివర్ణించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన సందర్భంగా, సీపీఐ నారాయణ మరోసారి తన వ్యతిరేకతను బయటపెట్టారు.


ప్రతిసారి వీడియో విడుదల చేసే నారాయణ, ఈసారి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘‘సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా  చేయగలవు. తాజాగా వింత జంతువులు, భార్యా, భర్తలు కానొళ్ళు, అన్న చెల్లెలు  కానోళ్ళు ముక్కు ముఖం తెలియని అందగాళ్ళు.. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో 100 రోజుల పాటు బూతుల స్వర్గంలో అమూల్య కాలాన్ని వృథా చేసే మహత్తర BIG BOSS వస్తున్నది’’ అని ఆయన అభివర్ణించారు.


శక్తి యుక్తులు ఉన్న యువత సమాజం కోసం పని చేయాలని అన్నారు. సామాజిక న్యాయం కోసం లేక సంపద కోసం పని చేయకుండా వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బూతుల స్వర్గం ఉత్పత్తి చేస్తారా అంటూ నారాయ‌ణ నిలదీశారు. ఈ కార్యక్రమాన్ని సిగ్గులేని ప్రేక్షకులు టీవీల ముందు విరగబడి చూస్తూ జాతీయ సంప‌ద‌ను వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘ప్రేక్షకులే దీనిపై అడగాలి. మాకేం సందేశమిస్తున్నారు? మొగుళ్ళు పెళ్ళాల్ని వదిలేసి - పెళ్ళాలు మొగుడ్ని వదిలేసి జీవించండని సందేశమిస్తారా? గుడ్లప్పగించి చూడండి. కాసులకు కక్కుర్తి పడే సమాజం ఉన్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నంత కాలం, ద్రౌపది వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాక‌రంగా దిగమింగుదామా? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని ఉరుకుదామా?’’ అంటూ సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


గతంలోనూ ఘాటు విమర్శలు, రేగిన దుమారం


గత సీజన్ల సందర్భంగానూ సీపీఐ నారాయణ బిగ్ బాస్ పైన విపరీతమైన కామెంట్స్ చేశారు. బ్రోతల్ హౌస్ అని ఆయన అనడంపై, బిగ్ బాస్ కంటస్టెంట్స్ తమన్నా సింహాద్రి, బాబు గోగినేని సహా పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిగ్‌బాస్‌ షోను బ్రోతల్‌ హౌస్‌ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలని తమన్నా సింహాద్రి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు వచ్చి ఉపాధి కలుగుతోందని అన్నారు. ఒకవేళ ఎవరికైనా షో నచ్చకపోతే ఛానెల్‌ మార్చుకోవాలని సలహా ఇచ్చారు. బాబు గోగినేని సైతం తనదైన శైలిలో నారాయణకు అప్పట్లో కౌంటర్ ఇచ్చారు.


బిగ్ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని కూడా ఓ సందర్భంలో మండిపడ్డారు. కళామ్మతల్లికి అన్యాయం చేస్తున్నారని, దీని ద్వారా కళామ్మతల్లికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇది చాలా అనైతిక షో అని అని అన్నారు. బిగ్ బాస్ ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు. ఇదో బూతుల ప్రపంచం అని, ఈ బూతుల ప్రపంచాన్ని వందల, వేల కోట్ల వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో బిగ్ బాస్‌కి అనుమతి ఇవ్వడం చాలా ఘోరం అంటూ గతంలో విమర్శించారు.