Delhi gang Rape Case:


అంతా డ్రామానే..


ఢిల్లీలోని ఘజియాబాద్‌లో నిర్భయ తరహా ఘటన జరిగిందన్న వార్తలు కలవర పెట్టాయి. ఓ మహిళను ఐదుగురు సామూహిక అత్యాచారం చేయటంతో పాటు ప్రైవేట్ పార్ట్‌లో రాడ్‌ను జొప్పించారన్న వార్తపై మహిళా సంఘాలు తీవ్రంగా మండి పడ్డాయి. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. విచారణ కొనసాగిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు విచారణ పూర్తయ్యాక...ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ "అత్యాచారం" అంతా కట్టుకథ అని తేల్చి చెప్పారు. భూ వివాదంలో పరిష్కరించుకునేందుకే మహిళ కిడ్నాప్, అత్యాచారం నాటకం ఆడిందని వెల్లడించారు. ఈ డ్రామాలో ఆమెకు సహకరించిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం 
ఉన్న నలుగురిని కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నలుగురికీ క్లీన్ చిట్ ఇస్తారా అన్న ప్రశ్నకు పోలీసులు సమాధానమిచ్చారు. "వారికి వ్యతిరేకంగా ఇంత వరకూ ఎలాంటి ఆధారాలు లభించ లేదు. అసలు వాళ్లు చెప్పిందేదీ అక్కడ జరగలేదు. అలాంటప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలు దొరికే అవకాశమే లేదు" అని స్పష్టం చేస్తున్నారు. మహిళను నిజంగానే కిడ్నాప్ చేశారా అని అడగ్గా..."ఆమె తనంతట తానుగానే వెళ్లింది" అని బదులిచ్చారు. వాళ్ల చాట్‌ ఆధారంగా ఈ కేసుని ఛేదించినట్టు వెల్లడించారు. అంతే కాదు. ఈ కట్టుకథను అల్లేందుకు ఆ మహిళ ఆ నలుగురికి డబ్బు కూడా ఇచ్చినట్టు తేలింది. రెండ్రోజుల పాటు ఐదుగురు తనను అత్యాచారం చేశారని మహిళ ఆరోపణలన్నీ పోలీసులు అవాస్తవం అని వెల్లడించారు. 


వైద్యపరీక్షలకు బాధితురాలి నిరాకరణ..


ఇదంతా తేలక ముందు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలాల్‌ ఈ ఘటనపై స్పందించారు. ఓ 36 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి గోనె సంచిలో కుక్కారని ఆమె మండి పడ్డారు. 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలపిస్తోందని విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు. ఘజియాబాద్ పోలీసులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే...పోలీసుల విచారణ తరవాత ఇదంతా "కట్టుకథ" అని తేలింది. నిందితుల్లో ఒకరైన ఆజాద్‌ మొబైల్ ఫోన్‌ స్విచ్ఛాప్ అయిందని, సరిగ్గా అదే సమయానికి ఆ మహిళ కనిపించకుండా పోయినట్టు నాటకం ఆడిందని చెప్పారు. సోదరుడి బర్త్‌డేని సెలబ్రేట్ చేసేందుకు ఘజియాబాద్ వెళ్లానని, పార్టీ ముగిశాక తన సోదరుడు ఓ చోట డ్రాప్ చేసి వెళ్లాడని మహిళ చెప్పింది. తెలిసిన వాళ్లు వచ్చి అక్కడ తనను పికప్ చేసుకున్నారని కట్టుకథ అల్లింది. గన్‌ చూపించి కార్‌లో బలవంతంగా ఎక్కించారనీ చెప్పింది. పోలీసులు మాత్రం "ఇదంతా ఓ భూతగాదాలో భాగంగా జరిగిన డ్రామా" అని నిర్ధరించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు అవలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యాచారానికి గురయ్యానని ఆ మహిళ చెప్పడం వల్ల మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపామని, కానీ..ఆమె అందుకు అంగీకరించలేదని అన్నారు. మొత్తానికి ఒక్కరోజులో దేశ రాజధానిలో సంచలనమైన ఈ కేసు...ఈ మలుపు తీసుకుంది.


Also Read: Himachal Pradesh Polls: చాయ్‌వాలాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన భాజపా!