Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓ చాయ్‌వాలాకు భాజపా అవకాశం ఇచ్చింది. శిమ్లా అర్బన్ అసెంబ్లీ స్థానంలో నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనపెట్టి చాయ్‌వాలా సంజయ్ సూద్‌కు టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం శిమ్లా అర్బన్ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయన నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఈసారి ఆయనను పక్కనబెట్టి సంజయ్‌కు అవకాశం కల్పించింది పార్టీ అధిష్ఠానం. అయితే మంత్రి సురేశ్‌ను కాసుంప్టి స్థానం నుంచి భాజపా నిలబెట్టింది.
ఒకే విడతలో
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కొవిడ్-19 నిబంధనలను అనుసరించాలని సీఈసీ కోరారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.
కీలక తేదీలు
- నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ: నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబర్ 8
2017లో
2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 చోట్ల భాజపా గెలిచింది. దీంతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో జై రామ్ ఠాకూర్‌ను పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.
Also Read: UK Political Crisis: రిషికి ఛాన్స్ ఇవ్వండయ్యా! ప్రధాని రేసులో మళ్లీ మనోడు!