UK Political Crisis: బ్రిటన్‌ రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే కాదు.. ఆ దేశ పౌరులకే అర్థం కావడం లేదు. ఎందుకంటే 2016 బ్రెగ్జిట్‌ తర్వాత ఏడేళ్లలో బ్రిటన్‌ ఐదో ప్రధానిని చూడబోతోంది. అంతా చక్కబెడతారని రిషి సునక్‌ను కాదని అధికార పగ్గాలు తీసుకున్న లిజ్‌ ట్రస్ 45 రోజులకే పదవి నుంచి దిగి పోయారు. మరి ఇప్పుడు తరువాతి ప్రధాని ఎవరు?


రేసులో రిషి


లిజ్‌ ట్రస్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు ఎవరు చేపడతారు? భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు ఇప్పుడైనా అవకాశం ఇస్తారా? సమర్థుడైన ఆర్థిక మంత్రిగా పేరొందిన రిషి మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌ను గట్టెక్కించగలరని చాలా మంది పార్టీ నేతలు నమ్ముతున్నారు. కానీ మరి ఆయనకు అవకాశం ఇస్తారా?


ట్రస్‌ రాజీనామాతో ఇప్పుడు అందరి కళ్లూ మళ్లీ రిషి వైపే చూస్తున్నాయి. అయితే రేసులో ముందంజలోనే ఉన్న రిషికి కన్జర్వేటివ్‌ పార్టీలోని అంతర్గత రాజకీయాలు తలొనప్పి తెస్తున్నాయి. ఎందుకంటే తరువాతి ప్రధాని రేసులో రిషి సునక్ పేరుతో పాటు పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.


బోరిస్ X రిషి


రిషి సునక్‌తో పాటు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఆ పదవికి పోటీ పడతారని వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌, ప్రతినిధుల సభ నేత పెనీ మోర్డౌంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌.. పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలోనూ రిషికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.


అయితే తన రాజీనామాకు కారణమైన సునక్‌ను ప్రధానిగా చూడటానికి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికల్లోనే ట్రస్‌ కంటే తొలుత రేసులో ముందంజలో ఉన్న సునక్‌కు వ్యతిరేకంగా బోరిస్ ప్రచారం చేశారు. సునక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతిచ్చారు. ఆమె గెలిచేలా చేశారు. తాజాగా మళ్లీ రంగంలోకి దిగాలని బోరిస్ ఆశపడుతున్నారు.


మళ్లీ ఎన్నికలు


బ్రిటన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2025లో జరుగుతాయి. అప్పటి వరకు మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థే ప్రధాని అవుతారు. ట్రస్‌ తర్వాతి ప్రధానిని ఎన్నుకునేది కన్జర్వేటివ్‌ పార్టీయే. మరి ఈసారైనా పార్టీ సరైన వ్యక్తిని ఎన్నుకుంటుందా లేదా చూడాలి.


రిషి సునక్‌కు ఆర్థిక మంత్రిగా సేవలందించినప్పుడు మంచి పేరు ఉంది. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.


Also Read: Liz Truss Resigns: ఆ ఒక్క నిర్ణయమే పడగొట్టిందా? లిజ్ ట్రస్‌ రాజీనామాకు కారణాలెన్నో!