Delhi Excise Policy Case:


కొద్ది రోజుల పాటు విచారణ..


లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు విచారణ చేపట్టిన అధికారులు మరోసారి ప్రశ్నలు సంధించనున్నారు. జైల్లోనే సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్చి 7వ తేదీన దాదాపు 6 గంటల పాటు విచారించిన అధికారులు...స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. ఇంకొన్ని రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇవాళ మళ్లీ విచారణకు వెళ్లారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది CBI. ఈ నెల 20 వరకూ కస్టడీలోనే ఉండనున్నారు. సిసోడియా అవినీతికి పాల్పడ్డారని తేల్చి చెబుతోంది దర్యాప్తు సంస్థ. సెల్‌ఫోన్‌లలో ఆధారాల్లేకుండా వాటిని నిర్వీర్యం చేయడం సహా పదేపదే మొబైల్స్ మార్చడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు...సిసోడియాను ఈ విషయమై ప్రశ్నించనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనా విచారణ జరుపుతున్నారు. ఈ పాలసీ అమల్లో భాగంగా భారీ మొత్తంలో లంచాలు ఇచ్చిన వారికే లిక్కర్ ట్రేడింగ్ లైసెన్స్‌లు జారీ చేసినట్టు CBI ఆరోపిస్తోంది. అయితే...ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తోంది. ఆ తరవాత మొత్తంగా ఈ పాలసీనే రద్దు చేసింది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దీనిపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపాదించిన తరవాతే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి నుంచి విచారణ కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. 






ఆప్ ఆరోపణలు..


సిసోడియాను విపాసన సెల్‌లో కాకుండా ఇతర నేరస్థులతో కలిపి ఉంచారని ఆరోపిస్తోంది ఆప్. సిసోడియాను విపాసన సెల్‌లో ఉంచాలన్న తమ అభ్యర్థనను కోర్టు అంగీకరించినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు విమర్శలు చేశారు. 


"తిహర్‌ జైల్లో విపాసన సెల్‌లో సిసోడియాను ఉంచాలని మేం కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అందుకు కోర్టు అంగీకరించింది కూడా. కానీ సిసోడియాను ఇతర నేరస్థులతో కలిపి జైల్ నంబర్1లో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వాలి" 


-సౌరభ్ భరద్వాజ్, ఆప్ జాతీయ ప్రతినిధి


అయితే అధికారులు మాత్రం ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని చెబుతున్నారు. సీనియర్ సిటిజన్స్‌ని ఉంచే సెల్‌లోనే సిసోడియాను ఉంచామని వివరించారు. ఇదే సమయంలో కోర్టు సిసోడియాకు కొన్ని అనుమతులు ఇచ్చింది. భగవద్గీత, అద్దాలు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. మెడిటేషన్ చేసుకునేందుకూ తిహార్ జైలు అధికారులు అనుమతినిచ్చారు. 10వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ 7 రోజుల పాటు ప్రశ్నించింది. అయితే సిసోడియా సహకరించలేదని సీబీఐ వర్గాలుచెబుతున్నాయి.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్టులో  సీబీఐ ఆరోపించింది.


Also Read: Kavitha In Delhi: కవిత రిక్వెస్ట్‌కు ఈడీ అంగీకారం! ఉత్కంఠకు తెర - నేడు కవిత కీలక ప్రెస్ మీట్