మహరాష్ట్రలో అదృశ్యమైన బాలుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దొరికిన కేసులో కూపీ లాగిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్‌ అయిన పగడాల శ్రావణి, శిల్ప ఇచ్చిన సమాచారంతో కేసులో మరిన్ని కోణాలను పోలీసులు వెలికితీశారు. మరో ముగ్గురు పిల్లలను కూడా అమ్మేసినట్టు తేలింది. ఈ ముఠా స్కేచ్‌లు విన్న పోలీసులకే మైండ్‌ బ్లాంక్ అయింది. 


సంతానం లేని దంపతులు, లోపాలు ఉన్న సంతానం కలిగిన తల్లిదండ్రులే టార్గెట్‌గా ఈ ముఠా వ్యాపారం చేసింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలలో నలుగురు పిల్లలను పోలీసలు గుర్తించారు. వారిని తీసుకొచ్చి అసలు తల్లిదండ్రులకు అప్పగించారు.  


హైదరాబాద్‌లోని ఐవీఎఫ్‌ సెంటర్‌లకు ఎగ్‌ డోనర్‌ ఏజెంట్‌గా పని చేస్తోంది శ్రావణి, గుజరాత్‌కు చెందిన రంజిత అలియాస్‌ సుల్తానాతో కలిసి ఈ దందా సాగిస్తోంది.  ఆమె సికింద్రాబాద్‌లో ఉంటున్న సుల్తానా, నూర్జాహాన్, షమీరాతో కలిసి ముఠాగా ఏర్పడి పిల్లలను విక్రయించేవాళ్లు. 


ఈ ముఠా విక్రయించిన పిల్లలను పోలీసులు వెతికి పట్టుకున్నారు. బ్రాహ్మణ బజారులో ఉంటున్న జయలక్ష్మి అనే మహిళ కు ఓ బాలుడిని అమ్మారు. ఇంకో వ్యవసాయ కుటుంబానికి మరో బాలుడిని అమ్మారు. వాళ్లకు ఉన్న సంతానం మానసిక వికలాంగులు కావడంతో వాళ్లకు ఓ బిడ్డను అమ్మారు. మరో ఫ్యామిలీలో అంతా ఆడపిల్లలనే అన్న కారణంతో మరో బిడ్డను కొనుగోలు చేసింది.


పిల్లల విక్రయంలో ఈ ముఠా చాలా తెలివిగా వ్యవహరించింది. వారి వారి కొనుగోలు శక్తిని బట్టి పిల్లలను విక్రయించే వాళ్లు. రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పిల్లలను అమ్మేవాళ్లు.  ఇలా అమ్మేటప్పుడు కొనేవాళ్లకు అనుమానం రాకుండా ఉండేలా... రకరకాల కారణాలు చెప్పేవాళ్లు. తల్లిదండ్రులు చనిపోయారని... సంతానం ఎక్కువై పెంచలేకపోతున్నారని మరికొందరికి చెప్పేవాళ్లు. 


మహారాష్ట్రలోని పర్బానీలో చిన్నారుల కిడ్నాప్‌లు ఎక్కువ ఉండటంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతోందని నిఘా పెట్టారు. దీంతో తీగ లాగితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో  డొంక కదిలింది.


ఇలా దొరికారు


ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడు ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జగ్గయ్యపేట ప్రాంతంలోని దేవుపాలెం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేట్ స్కూలులో ప్రస్తుతం ఆ బాలుడు చదువుతున్నాడు. ముంబయిలో 2022లో బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లుగా కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అక్కడ పోలీసులకు విజయవాడకు చెందిన మహిళ బాలుడిని తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఆమె బాలుడిని జగయ్యపేటలోని ఓ మహిళకు 2లక్ష్లల రూపాయలకు అమ్మేసింది. ఆమె దేవుపాలెంలోని తమ బంధువులకు మూడు లక్షల రూపాయలకు బాలుడిని ఇచ్చేసింది. 


అప్పటి నుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడు జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అంతా వారి పిల్లాడే అనుకుంటున్న టైంలో పోలీసులు వచ్చి ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన ఫ్యామిలీ బిడ్డగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 


పాఠశాల వార్షికోత్సవంలో సందడి చేస్తున్న సదరు బాలుడిని పోలీసులు గుర్తించి తీసుకెళ్లారు. ఆధారాలతో పోల్చి చూశారు. మహారాష్ట్ర పోలీసులు, స్థానిక పోలీసులు మాట్లాడుకొని గతంలో కిడ్నాప్ అయిన బాలుడు ఈ బాలుడు ఒక్కడే అని నిర్దారణకు వచ్చారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఎస్ఐ రామారావు సహకారంతో మహారాష్ట్ర పోలీసులు కేసు పత్రాలు చూపించి, బాలుడిని తీసుకెళ్లిపోయారు. 









ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడిని హఠాత్తుగా పోలీసులు తీసుకువెళ్ళిపోవటంతో పెంచుకున్న తల్లి, కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఈ వ్యవహరం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కిడ్నాప్ చేసిన విజయవాడకు చెందిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లను విచారించడంతో బాలుడి ఆచూకీ లభించిందని, పూర్తి సమాచారం సేకరించి, కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్ పత్రాలు, ఇతర వివరాలు తెలుసుకొన్న తరువాతే బాలుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.