ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాయడంపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించినట్లు సమాచారం. తాను 11వ తేదీన విచారణకు రాగలనని కవిత లేఖలో ఈడీని బుధవారం (మార్చి 8) కోరారు. దీనిపై గురువారం (మార్చి 9) ఉదయం ఈడీ అధికారులు స్పందించారు. కవిత విజ్ఞాపనకు ఈడీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మార్చి 11వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీంతో ఈడీ అధికారులు ఆమె లేఖను పరిగణనలోకి తీసుకుంటారా లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది.


మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్


ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఈ విలేకరుల సమావేశం ఉండనుంది. రేపు జంతర్ మంతర్‌లో మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ధర్నా చేయనున్నారు. 11న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే ప్రెస్ మీట్‌లో రేపు నిర్వహించబోయే జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఈడీ నోటీసుపై కవిత మాట్లాడనున్నారు.