Arvind Kejriwal:



సీబీఐ విచారణకు హాజరు..


ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసులిచ్చింది. ఈ మేరకు కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం వస్తున్న క్రమంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది భద్రతా సిబ్బంది అక్కడ కాపు కాస్తోంది. పారామిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేశారు. సీబీఐ ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. ఈ విచారణకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాను అరెస్ట్ అయ్యే అవకాశముందని చెప్పారు. బీజేపీ ఆదేశిస్తే సీబీఐ అధికారులు తనను అదుపులోకి తీసుకుంటారని ఆరోపించారు. 


"సీబీఐ నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది. బీజేపీ ఏం చెబితే అది చేస్తుంది సీబీఐ. కచ్చితంగా విచారణకు హాజరవుతాను. వాళ్ల చేతుల్లో పవర్ ఉంది. ఎలాంటి వాళ్లనైనా జైలుకు పంపుతారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయమని బీజేపీ ఆదేశిస్తే అధికారులు తప్పకుండా నన్ను అరెస్ట్ చేస్తారు. వాళ్లేం చెబితే అది చేయడమేగా సీబీఐ పని"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేశారు కేజ్రీవాల్. 


"ప్రధాని గారూ...ఒకవేళ నేను అవినీతిపరుడిని అని తేలితే ఈ ప్రపంచంలో నిజాయతీపరులే లేనట్టే లెక్క. నేను దేశం కోసమే బతుకుతున్నా. దేశం కోసం చనిపోవడానికైనా సిద్ధమే. నాకు 100 సార్లు నోటీసులు ఇచ్చినా నేను విచారణకు హాజరవుతాను. మీరు భారతీయులను ఇలా వేధించగలరేమో కానీ భారత్ ముందుకెళ్లకుండా మాత్రం అడ్డుకోలేరు. ప్రపంచంలోనే భారత్ నంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది"


-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి