Delhi Assembly Ruckus:
కేజ్రీవాల్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు..
ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా, తన బలం నిరూపించుకునేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపై విశ్వాస పరీక్షకు దిగారు. ఈ పరీక్షలో ఆప్ సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో ఆప్‌నకు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా...59 మంది కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలిచారు. మరో ఇద్దరు విదేశాలకు వెళ్లటం వల్ల ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ భాజపాపై మండి పడ్డారు. 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కాషాయ పార్టీ బేరసారాలు కొనసాగించిందని మరోసారి విమర్శించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విఫలమైందనటానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దాదాపు 49 మంది ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాకు మద్దతు తెలిపారు. సిసోడియా ఏ తప్పూ చేయలేదని CBI కి కూడా తెలుసని అన్నారు. అయినా...ఆయనపై 13 కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిసినా...సిసోడియా సీబీఐ విచారణను స్వాగతించారని గుర్తు చేశారు. సిసోడియా ఇంట్లోనే కాకుండా తన గ్రామానికీ వెళ్లి బ్యాంక్ లాకర్‌ని తనిఖీ చేశారని, వాళ్లకు అక్కడ ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సిసోడియా ఏ తప్పూ చేయలేదని CBIకి తెలిసినప్పటికీ...ఆయనను అరెస్ట్ చేయాలని కేంద్రం పైనుంచి ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. సిసోడియాపై సీబీఐ దాడులు చేసిన తరవాత గుజరాత్‌లో ఆప్ ఓటు శాతం 4% మేర పెరిగిందని, ఆయనను అరెస్ట్ చేస్తే...ఇది 6% వరకూ పెరిగే అవకాశముందని జోస్యం చెప్పారు. స్కూల్స్, ఆసుపత్రులు నిర్మించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా రూ.20-50కోట్ల ఖర్చు చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్ మంచి చేసిన ప్రతి చోటా సీబీఐతో సోదాలు చేయిస్తున్నారని మండి పడ్డారు. తన ఇద్దరు పిల్లలూ IITలోనే చదివారని...ఢిల్లీలోని విద్యార్థులందరికీ ఆ స్థాయి విద్య అందించాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు.
సిసోడియాకు కూడా ఆఫర్..?
సీబీఐ లిక్కర్ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Telangana Early Elections : తెలంగాణలో మళ్లీ ముందస్తు ఊహాగానాలు - కేబినెట్ భేటీ వైపే అందరి చూపు !
Also Read: Transhumanism: మనిషికీ 2.0 వర్షన్ ఉందా? ట్రాన్స్‌హ్యూమనిజం కాన్సెప్ట్ ఏంటో తెలుసా?