మొన్న పాండ్యాకు దినేశ్ కార్తీక్.. నేడు సూర్యకుమార్ కు విరాట్ కోహ్లీ. ఏంటి అనుకుంటున్నారా. అదేనండి టేక్ ఏ బౌ. టీమిండియా జట్టులో ఎవరు బాగా ఆడినా టీం సభ్యులందరూ సంతోషపడతారు. మరీ ముఖ్యంగా విరాట్ అయితే సహచరులు బాగా ఆడితే తానే ఆ ఫీట్ సాధించినంత సంబరపడిపోతాడు. తాను స్టార్ బ్యాట్స్ మెన్ అయినా సరే చిన్నపిల్లాడిలా వారి విజయాన్ని ఆస్వాదిస్తాడు. అలాంటి ఘటనే నిన్న భారత్- హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగింది. పసికూనతో మ్యాచ్ లో బ్యాట్ తో వీరవిహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ ను కోహ్లీ మెచ్చుకున్నాడు. అది కూడా టేక్ ఏ బౌ స్టైల్ లో. 


అసలేం జరిగిందంటే..


మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను రోహిత్, రాహుల్ ఆరంభించారు. రోహిత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 21 పరుగుల వద్ద కెప్టెన్ ఔట్ కాగా.. క్రీజులోకి వచ్చిన విరాట్ కూడా ఆచితూచి ఆడాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. అయితే రాహుల్ ఔట్ అయ్యాక కోహ్లీకి జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టాడు. మరీ ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో సూర్య రెచ్చిపోయాడు. మొదటి మూడు బంతులను స్టాండ్స్ లోకి పంపించాడు. ఈ క్రమంలో యువరాజ్ లా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని అందరూ భావించారు. అయితే నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతిని మళ్లీ సిక్సులా మలిచాడు. ఆరో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మొత్తం ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. కోహ్లీ, సూర్య ఇద్దరూ కలిసి ఏడు ఓవర్లలోనే మూడో వికెట్ కు 98 పరుగులు జోడించారు. 


ఈ క్రమంలోనే సూర్య బ్యాటింగ్ కు ఫిదా అయిన కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతనికి టేక్ ఏ బౌ సమర్పించాడు. కోహ్లీ నుంచి ఇలాంటి అభినందన వస్తుందని ఊహించలేదని.. ఎంతో ఆనందంగా ఉందని సూర్యకుమార్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.


అదరగొట్టిన సూర్యకుమార్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తన తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. వేగంగా ఆడే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (36: 39 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (59 నాటౌట్: ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నింపాదిగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అతి జాగ్రత్తతో ఆడటంతో స్కోరు బాగా నిదానించింది. 10 ఓవర్లకు జట్టు స్కోరు 70 పరుగులు మాత్రమే.


ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రాహుల్ కూడా అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్: 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 98 పరుగులు జోడించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో సూర్యకుమార్ హిట్టింగ్ నెక్స్ట్ లెవల్. నాలుగు సిక్సర్లు, రెండు పరుగులతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఛేదనలో హాంకాంగ్ 152 పరుగులకే పరిమితమైంది.