ఆసియాకప్ టోర్నీలో భారత్ ఖాతాలో మరో విజయం పడింది. బుధవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హాంగ్ కాంగ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.


నింపాదిగా ఆడిన హాంగ్ కాంగ్
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అయితే అలాగని వికెట్లు కూడా వరుసగా కోల్పోలేదు. చాలా నెమ్మదిగా ఆడుతూ పూర్తి ఓవర్ల పాటు హాంగ్ కాంగ్ ఆలౌట్ కాకుండా నిలబడింది. బాబర్ హయత్ (41: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), కించిత్ షా (30: 28 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు. అర్ష్ దీప్ సింగ్ (నాలుగు ఓవర్లలో 44), అవేష్ ఖాన్ (నాలుగు ఓవర్లలో 53) ధారాళంగా పరుగులు సమర్పించారు. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ కూడా సరదాగా ఒక ఓవర్ వేశాడు. తన ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.


అదరగొట్టిన సూర్యకుమార్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తన తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. వేగంగా ఆడే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (36: 39 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (59 నాటౌట్: ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నింపాదిగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అతి జాగ్రత్తతో ఆడటంతో స్కోరు బాగా నిదానించింది. 10 ఓవర్లకు జట్టు స్కోరు 70 పరుగులు మాత్రమే.


ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రాహుల్ కూడా అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్: 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 98 పరుగులు జోడించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో సూర్యకుమార్ హిట్టింగ్ నెక్స్ట్ లెవల్. నాలుగు సిక్సర్లు, రెండు పరుగులతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.