Delhi Acid Attack:
ఢిల్లీ మహిళా కమిషన్ ఫైర్ లేఖ..
ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాసిడ్ విక్రయాలపై కఠిన ఆంక్షలు ఉన్నా... నిందితుడు అది ఎక్కడ కొన్నాడని ఆరా తీశారు పోలీసులు. చివరకు తేలిందేంటంటే...ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ ఆర్డర్ చేశాడు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ మండి పడింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అంత సులువుగా యాసిడ్ దొరకడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ రెండు
సంస్థల సీఈవోలకు లేఖ రాసింది. "నిందితుడు ఆన్‌లైన్‌లో యాసిడ్ కొనుగోలు చేశాడని విచారణలో తేలింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో యాసిడ్ అమ్మడం నిషేధం. చట్ట రీత్యా నేరం. అంత సులభంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వెంటనే దీనిపై దృష్టి సారించండి" అని లేఖలో పేర్కొంది ఢిల్లీ మహిళా కమిషన్. ఈ రెండు పోర్టల్స్‌లో యాసిడ్‌ను అందుబాటులో ఉంచిన సెల్లర్స్ వివరాలను తెలియజేయాలని అడిగింది. వారి లైసెన్స్ వివరాలనూ అందించాలని కోరింది. ఆన్‌లైన్‌లో యాసిడ్ కొనే వారి IDని అడుగు తున్నారా..? ఒకవేళ అడగకపోతే ఎందుకలా చేయడం లేదు..? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని చెప్పింది. ప్రభుత్వాలు నిషేధించిన వస్తువులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడమేంటని ప్రశ్నించింది. ఎవరెవరకు ఈ పోర్టల్స్‌లో యాసిడ్ విక్రయిస్తున్నారో చూసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విచారణ వేగవంతం..
దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి బాధితారులు ICUలో చికిత్స పొందుతోందని చెప్పారు. "ముఖం దాదాపు 7-8% మేర కాలిపోయింది. కళ్లలోనూ యాసిడ్ పడింది" అని చెప్పారు. స్పెషల్ సీపీ చెప్పిన వివరాల ప్రకారం... నిందితుడు సచిన్ అరోరాతో ఒకప్పుడు బాధితురాలు సన్నిహితంగా ఉండేది. రెండు మూడు నెలలుగా అతడిని దూరం పెట్టింది ఆ అమ్మాయి. ఆ కోపంతోనే దాడి చేసినట్టు నిందితుడు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక యాసిడ్ ఎక్కడ కొన్నారన్న ప్రశ్నకూ నిందితుడు సమాధానం చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొనుగోలు చేసినట్టు చెప్పాడు. ఈ నిందితుడికి మరో స్నేహితుడు వీరేంద్ర సింగ్ సహకరించాడు. అరోరాకు చెందిన బైక్‌ని, మొబైల్‌ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. వేరే లొకేషన్‌కు తీసుకెళ్తే నిందితుడిని ట్రాక్ చేయడం పోలీసులకు కష్టతరమ వుతుందని ఇలా ప్లాన్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌ను మిస్‌లీడ్ చేసేందుకు ఇలా చేశారని విచారణలో తేలింది.
12వ తరగతి చదువుతున్న బాధితురాలు...స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఆ సమయంలో బాధితురాలితో పాటు పక్కనే తన చెల్లెలు కూడా ఉందని చెప్పారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ఉదయం 7.30 నిముషాలకు ఇంటి నుంచి బయటకు వచ్చారని, కొంత దూరం వెళ్లిన వెంటనే ఈ దాడి జరిగిందని చెప్పారు. నిందితులు మాస్క్ పెట్టుకుని దాడి చేశారు. తనను వెంబడిస్తున్నారని కానీ... వేధిస్తున్నారని కానీ తన కూతురు ఎప్పుడూ చెప్పలేదని తల్లిదండ్రులు వెల్లడించారు.
Also Read: UN Security Council: ఐరాస భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించండి - బైడెన్ సర్కార్ ముందు ప్రతిపాదన