UN Security Council:
ఇద్దరు చట్ట సభ్యుల ప్రతిపాదన..
ఐరాస భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇప్పటికే...అగ్రరాజ్యం ఈ విషయమై చాలా సార్లు మాట్లాడింది. ఇప్పుడు మరోసారి అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు మరోసారి ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. బైడెన్ ప్రభుత్వానికి ఈ మేరకు ఓ ప్రతిపాదన కూడా పంపారు. భద్రతా మండలి నుంచి రష్యాను తప్పించాలని కోరుతూ ఈ ప్రతిపాదనను బైడెన్ ముందుంచారు. ఐరాస భద్రతా మండలిలో రష్యా నిబంధనలు ఉల్లంఘిస్తోందన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే...బైడెన్ యంత్రాంగంతో సంప్రదింపులు మొదలు పెట్టారు...టెన్నెస్సీ ప్రతినిధి స్టీవ్ కోహెన్, సౌత్ కరోలినా ప్రతినిధి జో విల్సన్. వీళ్లిద్దరూసమర్పించిన నివేదికలో రష్యా ఉల్లంఘనలన్నింటినీ ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ఉద్దేశాలను, లక్ష్యాలను రష్యా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. అమెరికా సహా మిత్ర దేశాలన్నీ సంప్రదింపులు జరిపి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. భద్రతా మండలిలో రష్యా అధికారాలకు కోత విధించాలని, లేదంటే పూర్తిగా తొలగించాలని సూచించారు. మండలిలో వీలైనంత త్వరగా తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు.
యూఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి ఔట్..
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (UNHRC) నుంచి రష్యాను ఇప్పటికే బహిష్కరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ అంశంపై ఓటింగ్ జరిగింది. ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను తొలగించాలనే తీర్మానాన్ని అగ్రదేశం అమెరికా ప్రవేశపెట్టింది. మొత్తం 193 సర్వసభ్య దేశాలు ఐరాసలో ఉండగా.. అమెరికా తీర్మానానికి మద్దతుగా 93 దేశాలు ఓటు వేశాయి. మరో 24 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. 58 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భారత్ సైతం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండి రష్యాకు నైతిక మద్దతు తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య, దాడులతో పలు దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడటం యుద్ధ నేరంగా ఆరోపిస్తూ రష్యా సైనికులు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేయడానికి నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలమైన తీర్పు వచ్చింది. మెజార్టీ సభ్య దేశాల ఓటింగ్ తీర్పు మేరకు ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను తాత్కాలికంగా నిషేధించి యూఎన్ జనరల్ అసెంబ్లీ. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. తమకు అన్యాయం జరిగిందని, కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేశాయని రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను విలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించిన రిఫరెండంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇటీవలే ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్.. ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు
చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరిగింది.
Also Read: Tamil Nadu Road Accident: ఇలా కూడా యాక్సిడెంట్ అవుతుందా?- అమాంతం ఎగిరి పడిన బైకర్!