Debate over the abolition of birthright citizenship in the United States:  అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ చట్టాన్ని మార్చేశారు. వందేళ్లుగా అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికన్ పౌరసత్వం వస్తుంది. కాన్పు కోసం అమెరికాకు వచ్చినప్పటికీ అక్కడ పుడితే పౌరసత్వం ఇచ్చేస్తారు. వందేళ్లుగా అక్కడ అదే పద్దతి ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మార్చేశారు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా గ్రీన్ కార్డు హోల్డర్, పౌరసత్వం ఉన్న వారు ఉంటే మాత్రమే పౌరసత్వం ఇస్తారు. ఇది చాలా మంది భాతీయులను సైతం నిరాశపరిచేదే. 


అమెరికా పౌరసత్వం ఈజీగా వచ్చేది అక్కడ పుట్టడం ద్వారానే !


చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయ యువత పెళ్లి చేసుకుని అక్కడే పిల్లల్ని కంటారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండియాకు వచ్చి పిల్లల్ని కనరు. అక్కడ పెద్ద వారు లేకపోయినా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ పుడితే అమెరికన్ పౌరసత్వం వస్తుంది. తాము హెచ్ వన్ బీ వీసా మీద ఉన్నా.. మరో వీసా మీద ఉన్నా..గ్రీన్ కార్డు లేకపోయినా సరే ఆ పౌరసత్వం తమ పిల్లలకు వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి పౌరసత్వం లేకేపోతే.. .పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వరు. అదే సమయంలో గ్రీన్ కార్డు జారీపై పరిమితి ఉంది. ఇప్పటికే ఉన్న దరఖాస్తులు పోల్చుకుంటే వందేళ్ళకు సరిపడా గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే.. అవి కూడా లాటరీ ద్వారా పరిమితంగా వస్తాయి. ఈ  పద్దతి ప్రకారం చూస్తే.. అమెరికన్ పౌరసత్వం ఇక ముందు పొందడం గగనంగా మారుతుంది. 


ఎప్పుడు గెంటేస్తారో తెలియని అమెరికాకు వెళ్లాలా ?


అమెరికాకు ఎక్కువ మంది వెళ్లేది అక్కడ స్థిరపడిపోవడానికే. మళ్లీ ఇండియాకు రావాలని కాదు. ఆ గ్రీన్ కార్డు ఏదో వస్తే ఇక అమెరికన్లం అని చెప్పుకుని హాయిగా జీవించవచ్చని అనుకుంటారు. అదే సమయంలో పిల్లలకు అయినా పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఉంటుంది కదా అని అక్కడే సంపాదించి.. అక్కడే ఆస్తులు కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎప్పుడు గెంటేస్తారో తెలియని పరిస్థితిని ట్రంప్ సృష్టిస్తున్నారు. గ్రీన్ కార్డుపై ఆశలు పెట్టుకోవడం దండగని తేలిపోయింది. అదే సమయంలో పుట్టుకతో వచ్చే పౌరసత్వాలు కూడా ఉండవు. అలాంటి సమయంలో  ఇక అక్కడ ఆస్తులు కొని ఏం ప్రయోజనమన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఎప్పటికైనా మళ్లీ ఇండియాకు వెళ్లాల్సిందేగా అన్న  భావన మెల్లగా భారతీయ అమెరికన్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ వీసా రూల్స్ ని ఎప్పుడు ఎలా మార్చేస్తారో.. ఎంత మందిని దేశం నుంచి గెంటేస్తారో ఎవరూ ఊహించలేరు. 


అమెరికాపై భారతీయులు మోజు తగ్గించుకునే అవకాశం


అమెరికాపై భారతీయులు మోజు తగ్గించుకునే అవకాశం .. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. పిల్లల్ని అమెరికా కోసమే కంటున్నట్లుగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు. పిల్లల్ని చదివించి కోటి రూపాయలు అప్పు చేసైనా అమెరికాకు పంపిస్తే చాలనుకుంటారు. వారు అక్కడికి వెళ్లి అమెరికన్లుగా  బతికేసి .. ఎప్పుడో ఓ సారి చుట్టపు చూపుగా వచ్చి చూసి పోయినా సంతోషంగానే ఉంటారు. అమెరికా కోసం పుట్టించినట్లుగా ఇక పిల్లలను అక్కడకు పంపేందుకు ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో అవకాశాలు తగ్గిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా అమెరికాపై యువత మోజు తగ్గించుకుంటే మేధో వలస చాలా వరకూ తగ్గిపోయే అవకాశం ఉంది.