వర్షాల సీజన్‌ అయిపోయింది. రుతుపవనాలు వెనుదిరిగాయి. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులన్నీ రెండుసార్లు పొంగిపొర్లాయి. కానీ.. కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు మాత్రం  వెలవెలబోతున్నాయి. నీటి ప్రవాహంతో తొణికిలాడాల్సిన జలశయాల్లో అరకొర నిల్వలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో... కృష్ణా బేసిన్‌లో సరైన వర్షాలు కురవలేదు.  ఎగువ రాష్ట్రాల నుంచి వరదలు కూడా రాలేదు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆశించిన ప్రవాహం రాలేదు. దీంతో కృష్ణా పరీవాహకంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే  శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు.. నీటి నిల్వలు అడుగంటాయి. శ్రీశైలంలో ఉన్న నీటిని విద్యుత్‌ అవసరాలకు వినియోగించడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ పాతాళానికి  పడిపోయింది. మిగిలిన నీటి నిల్వలనే తాగు, సాగు నీటి అవసరాలకు చూసి చూసి వాడుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగు నీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిగులు పడుతున్నారు.


శ్రీశైలం రిజర్వాయర్‌కు ఈ ఏడాది వరద లేకపోవడంతో ఆరు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నంద్యాల జిల్లాకే అత్యధిక నష్టం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరద 128.21 టీఎంసీలే. ఈ నాలుగు నెలల కాలంలో తాగు, సాగు నీటి అవసరాలకు, విద్యుదుత్పత్తికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కలిసి 70.53 టీఎంసీలు వినియోగించేశాయి. ఇక మిగిలంది... 57.68 టీఎంసీల నీరు మాత్రమే. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి సాగు నీటి విడుదల కష్టమే అంటున్నారు అధికారులు. దీంతో.. తెలుగు గంగ, ఎస్సార్‌బీసీ, కేసీ కెనాల్ కింద ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఇక... నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 26.12 టీఎంసీలు చేరాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి వల్లే సాగర్‌కు ఆ మాత్రం నీరు చేరింది. ఈ రెండు  జలాశయాల్లో ప్రస్తుతం 277 టీఎంసీల లోటు ఉంది. 


అక్టోబర్ 19 వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అవి వర్షాలు పడతాయో లేదో... పడినా ఈ కొన్నిరోజుల్లో... ఆశించన స్థాయి ప్రవాహం ఉండదు. ఇక ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు వస్తేనే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుకుండలా మారుతుంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌లలో ప్రస్తుతం ఖాళీ ఉన్న 32.56 టీఎంసీలు భర్తీ అయితే గానీ దిగువకు నీరు విడుదల చేయరు. వర్షాకాలం ముగియడంతో.. ఎగువ రాష్ట్రాల నుంచి అంత ప్రవాహనం వచ్చే పరిస్థితులు లేవు. దీంతో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు.