Director Ravibabu on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్  వేదికగా ఆయనను విడిచి పెట్టాలని కోరుతున్నారు. అయితే తాజాగా క్రియేటివ్ దర్శకుడు, నటుడు రవిబాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. రామారావు, చంద్రబాబుల కుటుంబాలు తమకు ఆప్తులని రవిబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఎంతో కాలంగా చూస్తున్నానని.. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాగే బాబు ఏదైనా పని చేసే ముందు వంద యాంగిల్స్ లో ఆలోచించి అందరినీ సంప్రదించిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బంది కల్గకుండా చూడడమే ఆయన అంతిమ లక్ష్యం అంటూ వెల్లడించారు. ఆయనకు భూమి మీద ఇదే చివరి రోజు అని తెలిస్తే.. వచ్చే యాభై ఏళ్లలో తీసుకోవాల్సిన సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారని వివరించారు. 73 ఏళ్ల వయసున్న అలాంటి నాయకుడని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి హింసించడం దారుణం అన్నారు. 






"జీవితంలో ఏదీ శాశ్వతం కాదండి. సినిమా వాళ్ల గ్లామర్ కానీ రాజకీయ నాయకుల పవర్ గానీ మొత్తం శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కావు. రామారావుగారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి చాలా దగ్గరి ఆప్తులు. కావాల్సిన వారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు చెప్పాలంటే.. ఆయన ఏదైనా పని చేసే ముందు వంద యాంగిల్స్ లో చూసి, అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కల్గకుండా డిసీజన్ తీసుకుంటారు. ఆయనకి భూమి మీద ఇవాలే లాస్ట్ రోజు అని తెల్సినా కూడా కూర్చుని నెక్స్ట్ 50 సంవత్సరాలకు సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. మరి అలాంటి ఆయనను సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేదిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు చాలా సహజం. కానీ ఒక 73 ఏళ్ల వయసున్న ఆయనను జైల్లో పెట్టి హింసించడం ఓ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం. అశాశ్వతమైన పవర్ ఉన్న వారికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే.. మీరు ఏ పవర్ ను అయితే వాడి ఆయనను జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్ ను ఉపయోగించి విడిచిపెట్టండి. మీరు చిటికేస్తే జరిగిపోతుందని అది అందరికీ తెలుసు. ఆయనను బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన డెఫినెట్ గా ఈ దేశాన్ని విడిచి అయితే పారిపోరు. ఆలోచించండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్లలాగానా లేకపోతే ప్రేమ, జాలితో ఉండే మంచి నాయకుడిగానా" - రవిబాబు, దర్శకుడు, నటుడు


అశాశ్వతమైన పవన్ ఉన్న వారు అదే అధికారాన్ని వాడి చంద్రబాబును బయటకు తీసుకురావాలని రవిబాబు సూచించారు. ఆయన చిటికేస్తే చాలు బాబు బయటకు వస్తారని అందరికీ తెలుసంటూ కామెంట్లు చేశారు. అలాగే ఆయనను బయటకు పంపించిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా విచారణ జరిపించుకోవాలని సూచించారు. చంద్రబాబు అయితే దేశాన్ని వదిలి వెళ్లిపోయే మనిషి కాదని.. ఆయనను వదిలేస్తేనే చరిత్రలో మీరు మంచి వాళ్లుగా మిగిలిపోతారంటూ రవిబాబు చెప్పుకొచ్చారు.