Dalai Lama:


విధ్వంసాన్ని అరికట్టాలి: దలైలామా 


ఆయుధాల కారణంగా జరిగే విధ్వంసాన్ని ప్రపంచమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలని ఆధ్యాత్మిక వేత్త దలైలామా పిలుపునిచ్చారు. ఇందు కోసం అన్ని దేశాలూ  కృషి చేయాలని సూచించారు. రెండో  ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై జరిగిన అణు దాడులను గుర్తు చేసుకున్నారు. ఓ సారి హిరోషిమాకు వెళ్లానని అక్కడ ఎంత విధ్వంసం జరిగిందో కళ్లారా చూశానని చెప్పారు. 1945 ఆగస్టు 6, 9వ తేదీల్లో హిరోషిమా నాగసాకి ప్రాంతాలపై అణు బాంబులతో దాడులు చేశారు. "అణు బాంబుతో ఎంత విధ్వంసం జరిగిందో నేను కళ్లారా చూశాను. ఇప్పటికే కొన్ని దేశాలు అణు బాంబులు తయారు చేసుకున్నాయి. వీటి తయారీని వ్యతిరేకించిన దేశాలూ ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు దలైలామా. ఉక్రెయిన్ విషయంలో రష్యా పదేపదే అణు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో...దలైలామా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొవిడ్ గురించీ ప్రస్తావించారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ అన్ని దేశాలకూ వ్యాప్తి చెందిందని అన్నారు. "కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రజల్ని భయపెడుతోంది. వీలైనంత త్వరగా ఈ వైరస్ మనల్ని వదిలి వెళ్లాలని ప్రార్థిస్తున్నాను" అని వెల్లడించారు. 


ఆయుధాల్లేని ప్రపంచం కావాలి: దలైలామా


హరియాణా లోని గుడ్‌గావ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన దలైలామా...కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, భారత్ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మక దేశాలని, కానీ భారత్‌లో మాత్రం ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. భారత్‌లో అన్ని సంస్కృతులను, మతాలను గౌరవిస్తారని చెప్పారు. మనుషులంతా నిత్యం ఘర్షణ పడుతూ  హింసకు దారి తీయొద్దని, అంతా కలిసి మెలిసి జీవించాలని హితవు పలికారు. ఏదైనా సమస్యలుంటే అన్నదమ్ముల్లా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలన సూచించారు. ఆయుధాల్లేని ప్రపంచాన్ని సృష్టించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల హింసే రాజ్యమేలుతోందని, దీని వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కొన్ని దేశాలు అణ్వాయుధాలు వినియోగించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా హింస పెరిగిపోతోందని, మనుషులంతా తమ తెలివిని ఆయుధాలు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. "పక్క వాడిని ఎలా చంపేయాలి, పొరుగు దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలి అనే ఆలోచనలకే పరిమితమవుతున్నారు. ఇది ముమ్మాటికీ తప్పే" అని తేల్చి చెప్పారు. 


దలైలామా ప్రస్తుతం బిబార్‌లోని బోధ్ గయాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంచనల విషయం వెలుగులోకి వచ్చింది. దలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దలైలామాకు భద్రత పెంచారు. మహిళా గూఢచారి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. బోధ్‌గయాలో ఆమె పలు చోట్ల పర్యటించినట్టు నిఘా వర్గాల సమాచారం. ఫలితంగా పోలీసులు అందరినీ అప్రమత్తం చేశారు. ఆమె ఫోటోతో పాటు పాస్‌పోర్ట్ నంబర్, వీసా వివరాలు కూడా పోలీసులు షేర్ చేశారు. వీలైనంత త్వరగా ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పేరు సాంగ్ జియోలాన్‌ అని పోలీసులు వెల్లడించారు. సాధువు వేషంలో బోధ్ గయాకుఆమె వచ్చినట్టు చెబుతున్నారు. స్కెచ్ విడుదల చేసిన వెంటనే గయా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. 


Also Read: Pathaan Controversy: ‘పఠాన్’ సాంగ్‌పై వివేక్ అగ్నిహోత్రి విమర్శలు - ఆయన కూతురిని ట్రోల్ చేస్తున్న షారుఖ్ ఫ్యాన్స్