Vande Bharat Event: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి నిరసన సెగ ఎదురైంది. హౌరా స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన 'వందే భారత్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కుడున్న జనాల్లో ఒక వర్గం "జై శ్రీరామ్" నినాదా చేసింది. దీంతో మమతా బెనర్జీ వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు.
ఆమెను శాంతింపజేయడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సీవీ ఆనంద బోస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యమంత్రి మమతా ప్రేక్షకులతో పాటు వేదిక మందున్న కుర్చీలో కూర్చున్నారు. ఇంతకుముందు కూడా పలుమార్లు అధికారిక కార్యక్రమాల్లో భాజపా కార్యకర్తలు.. ముఖ్యమంత్రి దీదీని ఉద్దేశించి "జై శ్రీరాం" నినాదాలు చేశారు.
మోదీకి సానుభూతి
ఈ కార్యక్రమంలో వర్చువల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ తల్లి హీరాబెన్ మరణంపై సీఎం మమతా బెనర్జీ.. ప్రధానికి సంతాపం వ్యక్తం చేశారు.
హౌరా- న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ సాగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు.