Dalai Lama on China: 


చైనాకు చురకలు..


భారత్, చైనా సరిహద్దు వివాదంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దలైలామా. భారత్, చైనాను పోల్చుతూ పలు విషయాలు వెల్లడించారు. రెండు దేశాల్లోనూ తప్పొప్పులు ఉన్నాయని, కాకపోతే..ప్రజాస్వామ్యం,మతస్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ ఎంతో మెరుగ్గా ఉందని తేల్చి చెప్పారు. ఇదే భారత్‌ను చైనాతో వేరు చేసి చూపిస్తుందని అన్నారు. ఇదే సమయంలో అణు ఆయుధాల గురించీ ప్రస్తావించారు. హరియాణా లోని గుడ్‌గావ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన దలైలామా...ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, భారత్ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మక దేశాలని, కానీ భారత్‌లో మాత్రం ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. భారత్‌లో అన్ని సంస్కృతులను, మతాలను గౌరవిస్తారని చెప్పారు. మనుషులంతా నిత్యం ఘర్షణ పడుతూ  హింసకు దారి తీయొద్దని, అంతా కలిసి మెలిసి జీవించాలని హితవు పలికారు. ఏదైనా సమస్యలుంటే అన్నదమ్ముల్లా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలన సూచించారు. ఆయుధాల్లేని ప్రపంచాన్ని సృష్టించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల హింసే రాజ్యమేలుతోందని, దీని వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కొన్ని దేశాలు అణ్వాయుధాలు వినియోగించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా హింస పెరిగిపోతోందని, మనుషులంతా తమ తెలివిని ఆయుధాలు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. "పక్క వాడిని ఎలా చంపేయాలి, పొరుగు దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలి అనే ఆలోచనలకే పరిమితమవుతున్నారు. ఇది ముమ్మాటికీ తప్పే" అని తేల్చి చెప్పారు. 


చైనాకు వెళ్లే ప్రసక్తే లేదు: దలైలామా


చైనాకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని, ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని దలైలామా ఇటీవలే అన్నారు. భారత్ తనకు శాశ్వత నివాసం అని వెల్లడించారు.  "చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నాకు భారత్‌లో ఉండటమే ఇష్టం. ఇండియా నాకెంతో నచ్చింది. కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు. ఇదే నాకు శాశ్వత నివాసం" అని  స్పష్టం చేశారు. ఇక ఇటీవల తవాంగ్‌లో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావించగా దానికీ సమాధానమిచ్చారు దలైలామా. "మునుపటి కన్నా పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చైనా వైఖరి కాస్త మారింది. అయినా...చైనాకు వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు" అని వివరించారు.  1959లో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబెటియన్లు తమ ప్రాంతాన్నీ వీడాల్సి వచ్చింది. వారంతా భారత్‌కు వలస వచ్చారు. దలైలామా కూడా వారిలో ఉన్నారు. ముస్సోరి, ఉత్తరాఖండ్‌లో కొంతకాలం పాటు ఉన్నారు. 1960లో ధర్మశాలకు వెళ్లిపోయారు. ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్తగా పిలుస్తుంటే, చైనా మాత్రం "వేర్పాటువాది" అని ముద్ర వేసింది. "సన్‌ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తోంది.  అంతకు ముందు వారితో పోల్చితే ఎక్కువ కాలం పాటు జీవించిన  దలైలామాగా ఆయన రికార్డు సృష్టించారు. 1989లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ 14వ దలైలామాను టెంజిన్ గ్యాస్టోగానూ పిలుస్తారు. అహింసకు, కరుణకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. 


Also Read: China Covid Cases: చైనాలో కరోనా బీభత్సం- వచ్చే 3 నెలల్లో లక్షల్లో మరణాలు!