మీరు బరువు తగ్గించుకునే డైట్ ప్లాన్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ రెస్టారెంట్ లేదా కేఫ్ కి తినడానికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది. అబ్బా ఆ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది కదా. కళ్ళ ముందు నోరూరించే ఫుడ్ ఉన్నా కూడా తినలేకపోతారు కొంతమంది. కానీ మరికొంతమంది మాత్రం ఈ ఒక్కరోజే కదా ఏం కాదులే తింటే అని అనుకుని బొజ్జ నిండా లాగించేస్తారు. ఫలితంగా బరువు తగ్గాలనే ఆలోచన పక్కన పడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఇలా చేశారంటే మీకు ఇష్టమైనవి తినొచ్చు అలాగే డైట్ కూడా ఫాలో అయిన సంతృప్తి మిగులుతుంది.
ఫుడ్ ఆర్డర్ తో పాటు ఎక్స్ ట్రా బాక్స్ అడగండి
రెస్టారెంట్ లో ఫుడ్ మనం తినగలిగే దాని కంటే ఎక్కువగానే ఇస్తారు. రకరకాల ఫుడ్స్ ఆర్డర్ చేస్తారు. కళ్ళ ముందు రుచికరమైన ఆహారం కనిపిస్తే అసలు ఆగలేరు. అతిగా తినేస్తారు. అది మరింత హాని కలిగిస్తుంది. అందుకే అటువంటి సమయంలో భోజనంతో పాటు మిగిలిన ఆహారం పెట్టుకునేందుకు వీలుగా ఎక్స్ ట్రా బాక్స్ అడగాలి. మీ ఆకలిని బట్టి మీకు కావలసినంత మాత్రమే టిని మిగతా ఆహారాన్ని బాక్స్ లో పెట్టుకుంటే అతిగా తినకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఆ ఆహారం బయటకి వెళ్ళిన తర్వాత పేదలకి ఎవరికైనా ఇస్తే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు.
నెమ్మదిగా తినాలి
ఫుడ్ వచ్చింది కదా పక్కన వాళ్ళు గబగబా లాగించేస్తున్నారని మీరు కూడా వేగంగా తినేస్తున్నారా? అలా అసలు చేయకూడదు. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నములుతూ ఆస్వాదిస్తూ తినాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ మీరు నిండుగా ఉన్నారని గుర్తించి అతిగా తినకుండా నిరోధిస్తుంది.
ముందుగా సలాడ్ ఆర్డర్ చెయ్యాలి
కేఫ్ కి వెళ్ళినట్లయితే ముందుగా సలాడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అదే రెస్టారెంట్ అయితే ఇష్టమైన సూప్ ఆర్డర్ చేసుకుని తాగొచ్చు. కూరగాయల ముక్కలతో చేసే సలాడ్ తినడం వల్ల కొంత వరకు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అధిక కేలరీల భోజనం తీసుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే సూప్ తాగడం వల్ల కూడా పొట్ట నిండుగా ఉంటుంది.
నీటిని సిప్ చేస్తూ తినాలి
హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే భోజనం మధ్యలో కొద్దిగా నీటిని సిప్ చేస్తూ ఉండాలి. కొన్ని సార్లు నిజానికి దాహం వేసినప్పుడు కూడా ఆకలిగా అనిపిస్తుంది. అతిగా తినకుండా ఉండటానికి భోజనానికి ముందు నీరు తాగాలి. మధ్య మధ్యలో కూడా ఎక్కువగా కాకుండా కొద్దిగా నీటిని తీసుకోవడం మంచిదే.
బయట ఆహారం విస్మరించడం మంచిది
మీ బరువు తగ్గాలనుకునే లక్ష్యం చేరుకునే వరకి బయటి ఆహారాన్ని తినకుండా ఉండటమే మంచిది. కొన్ని ఇష్టమైన ఆహారాలు వదులుకోవడం వల్ల అనివార్యంగా మీరు ముందు కంటే ఎక్కువగా ఆహారాన్ని తింటారు. అందుకే సమతుల్య ఆహారం తీసుకుంటూ అదనపు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మాల్ట్ మిల్క్ అంటే ఏంటి? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?