Cyber Crime News: కరెంటు బిల్లు కట్టలేదంటూ మెసేజ్ పంపించారు. అందులో ఫోన్ నెంబర్ ఉండడంతో సదరు వ్యక్తి ఫోన్ చేసి అడిగాడు. మొత్తం ఎంత పెండింగ్ ఉందంటూ అడిగాడు. ఐదు రూపాయలు పంపిస్తే... మెత్తం విషయం తెలుస్తుందంటూ చెప్పగా... వారు చెప్పిన లింక్ ఓపెన్ చేసి 5 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత వాళ్లు స్పందించకపోవడంతో ఇతను కూడా వదిలేశాడు. నెల రోజుల తర్వాత తన అకౌంట్ లోని డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్లగా... నిల్ బ్యాలెన్స్ ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. షాకై 1.85 లక్షల డబ్బు ఉందని చెప్పగా.. కట్ అయినట్లు వివరించారు. ఇలా తాను మోసపోయినట్లు తెలుసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 


పశ్చిమ గోదావరి జిల్లా పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామ కృష్ణంరాజుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మార్చి 28వ తేదీన.. కరెంట్ బిల్లు కట్టలేదంటూ, కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో దానిలో ఉన్న ఫోన్ నెంబర్ కు పెదరామ కృష్ణంరాజు ఫోన్ చేశాడు. కరెంట్ బిల్లు ఇప్పటికే కట్టానని.. కానీ ఇలా మెసేజ్ ఎందుకు వచ్చిందని ఆరా తీశాడు. మీకు లింక్ పంపుతున్నాము, దానిని క్లిక్ చేస్తే తెలుస్తుందని చెప్పడంతో క్లిక్ చేశాడు. అందులో కరెంట్ బిల్లు కట్టినట్లు తెలియడం లేదని గుర్తు తెలియని వ్యక్తికి రామకృష్ణం రాజు ఫోన్ చేసి చెప్పాడు. ఓ నంబర్ పంపుతున్నాం, దానికి 5 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపితే తెలుస్తుందని చెప్పడంతో... పెదరామ కృష్ణంరాజు 5 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా ఎత్తడం మానేశారు. దీంతో పెదారామ కృష్ణంరాజు కూడా లైట్ తీసుకున్నాడు. 


అయితే తనకు డబ్బులు అవసరం ఉండడంతో బ్యాంకుకు వెళ్లిన పెదరామ కృష్ణంరాజు బ్యాంకుకు వెళ్లారు. డబ్బులు డ్రా చేయాలని చూడగా.. అందులో ఏం లేవని బ్యాంకు అధికారులు చెప్పారు. లేదు 1.85 లక్షలు ఉంటాయని చెప్పగా.. మార్చి 28వ తేదీన మొత్తం డబ్బులు కట్ అయినట్లు పేర్కొన్నారు. తాను ఆరోజు రూ.5 మాత్రమే పంపించానని చెప్పి, మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు ఎస్సై కే గంగాధర రావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్ లైన్ లింకులు క్లిక్ చేయొద్దని.. అలా చేస్తే మోసపోక తప్పదని వివరించారు. ఎవరైనా అలాంటివి పంపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 


15 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్


ఇటీవలే హైదరాబాద్ లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం నేరాలే కాదు, నేరగాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. అమాయక ప్రజల పేరిట దొంగ రుణాలు తీసుకొని కొందరు, క్రెడిట్ కస్టమర్ కేర్ పేరుతో మరికొంత మంది మోసాలకు పాల్పడిన వారు. ఇలా రకరకాల పేర్లతో మోసాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న 15 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి అమాయకుల పేరిట రూ.4.38 కోట్ల రుణాలు తీసుకున్న 10 మందిని తొలుత పోలీసులు అదుపులోకి తీసున్నారు. వీరంతా నకిలీ కంపెనీల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి, వారి డాక్యుమెంట్లతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి తీసేసి మళ్లీ కొత్త వాళ్లని రిక్రూట్ చేసుకున్నట్లు తేలింది. అలా కొత్తగా వచ్చిన వాళ్ల పేరిట మళ్లీ రుణాలు పొందడం షరా మామూలు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు.