క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపరస్టార్ షారుక్ ఖాన్ డ్రైవర్‌ను ఎన్‌సీబీ విచారించింది. ఈ మేరకు ఓ ఎన్‌సీబీ అధికారి తెలిపారు. అక్టోబర్ 9న దక్షిణ ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చిన షారుక్ డ్రైవర్ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం అతడ్ని వదిలేసినట్లు సమాచారం.
అక్టోబర్ 9న ఎన్‌సీబీ ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఈ తనిఖీల సమయంలో శివరాజ్ రామ్‌దాస్ అనే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెయిల్ నిరాకరణ..
క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబయి కోర్టు నిరాకరించింది. డ్రగ్స్ ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ఆర్యన్‌తో పాటు ఎనిమిది మందికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, ఆర్యన్ తరఫు న్యాయవాది మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మెర్చంట్, మూన్‌మూన్ ధమేచలకు బెయిల్ తిరస్కరించారు. ఈ ముగ్గురూ బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.
ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టును కోరారు. బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని వాదించారు.
ఎన్‌సీపీ సంచలన వాఖ్యలు..
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు, అరెస్టు వ్యవహారంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతంలోని క్రూజ్ నౌకలో ఎన్సీబీ దాడులు నకిలీవన్నారు. అక్కడ డ్రగ్స్ ఏమీ దొరకలేదని వ్యాఖ్యానించారు. షారుక్‌ని టార్గెట్ చేసినట్టు నెలక్రితమే సమాచారం వచ్చిందన్నారు. నౌకలో దాడుల సమయంలో ఎన్సీబీ బృందంతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. వారిలో ఒకరు భాజపాకు చెందినవారు అని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్‌ని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆర్యన్ అరెస్టు వెనక భాజపా కార్యకర్తల హస్తం ఉందని మంత్రి ఆరోపించారు.
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి