Bharat Biotech Nasal Vaccine: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
ఇక భయం వద్దు
కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడే వారికి ముక్కు ద్వారా వేసుకొనే ఈ టీకా ఉపశమనం కలిగించనుంది. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ముక్కుద్వారా వేసే ఈ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో గల భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' కరోనా టీకాను ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ప్రస్తుతం ఈ టీకాను సిరంజీ ద్వారా అందిస్తున్నారు.
ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా వేసుకోవాలి
ఈ వ్యాక్సిన్‌ను పోలియో చుక్కల తరహాలోనే ముక్కు పుటల్లో వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండానే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌తో కరోనాను 99.9 శాతం చంపేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, కెనడా యూకేల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
Also Read: మరో ట్విస్ట్ ఇచ్చిన పుతిన్- కిమ్ సాయంతో ఉక్రెయిన్‌పై పోరు!
Also Read: Bengaluru Rains: హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు!