Bengaluru Rains: హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు!

ABP Desam   |  Murali Krishna   |  06 Sep 2022 01:01 PM (IST)

Bengaluru Rains: బెంగళూరును భారీ వర్షాలు, వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

(Image Source: PTI)

Bengaluru Rains: కర్ణాటకను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. వర్షాల ధాటికి బెంగళూరును వరదలు ముంచెత్తాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు పడవలు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రహదారులపైకి వరదనీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. 

ట్రాక్టర్లపై టెకీలు

భారీ వర్షాలకు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించగా కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నాయి. కానీ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ట్రాలీలో కూర్చొని ఆఫీసులకు వెళ్తున్నారు.

సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహక సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

ఈ వరదలను మేం సవాల్‌గా తీసుకున్నాం. మా అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు, SDRF బృందం 24/7 పని చేస్తున్నారు. వరద నీటిని పంపులతో తోడిస్తున్నాం. చెరువులు, బోరుల వద్ద చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నాం. కర్ణాటక, బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురిశాయి. అయితే బెంగళూరు మొత్తం సమస్య లేదు. 2 మండలాలు, ముఖ్యంగా మహదేవపురలో వరద సమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 69 ట్యాంకులు ఉన్నాయి. అన్నీ పొంగిపొర్లుతున్నాయి.  బెంగళూరులో వరద సహాయక చర్యల కోసం రూ.1500 కోట్లు, ఆక్రమణలు తొలగించేందుకు మరో రూ.300 కోట్లు ఇచ్చాం. భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తాం. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల వచ్చిన సమస్య. ప్రణాళిక లేని పరిపాలన కారణంగానే ఇది జరిగింది. అక్రమ నిర్మాణాలకు వాళ్లు అనుమతి ఇచ్చారు.                            - బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం

భారీ వర్షాలు

సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు బెంగళూరులో సాధారణ వర్షాల కంటే 150 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

Published at: 06 Sep 2022 12:56 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.