Suresh Raina Retires: క్రికెటర్ సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రాష్ట్రం యూపీకి, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. బీసీసీఐకి, యూపీ క్రికెట్ అసోసియేషన్‌కు, సీఎస్కేకు, రాజీవ్ శుక్లాకు ధన్యవాదాలు తెలిపాడు. 


ఇన్ని రోజులు తనపై నమ్మకం ఉంచి, తనకు అండగా ఉన్న క్రికెట్ అసోసియేషన్స్ తో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు రైనా. తాజా నిర్ణయంతో దేశ వాలీ టోర్నీలే కాదు, ఐపీఎల్ లోనూ సురేష్ రైనా మెరుపులు ఇంక మనం చూడలేము. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా తాజాగా దేశవాలీ లీగ్‌లతో పాటు ఐపీఎల్ కు వీడ్కోలు పలికి తన అభిమానులకు మరోసారి ఆశ్చర్యానికి గురిచేశాడు. 


అన్ని ఫార్మాట్లలో రైనా పరుగులు..  
సురేష్ రైనా 13 ఏళ్ల టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్ లో 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 5,615 పరుగులు చేసిన రైనా టీ20ల్లో 1,605 రన్స్, టెస్టుల్లో 768 పరుగులు సాధించాడు. 






రిటైర్మెంట్ నిర్ణయంపై రైనా కామెంట్స్.. తాను రెండు లేదా మూడు సంవత్సరాలు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్ క్రికెట్‌కు మరికొంతమంది యువ ఆటగాళ్లు రావాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇందుకోసం తాను ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలకు తెలియజేశానని రైనా చెప్పినట్లు దైనిక్ జాగరణ్ రిపోర్ట్ చేసింది.


ఐపీఎల్‌లో అదరగొట్టిన రైనా..
టీమిండియాకు విలువైన పరుగులు చేసిన రైనా దేశవాలీ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. మొత్తం 205 మ్యాచ్‌లాడిన రైనా.. 32.51 సగటు, 136.76 స్ట్రైక్ రేట్‌తో 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో శతకం బాదిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్ లో ఓ శతకం, 39 అర్ధ శతకాలు చేశాడు రైనా. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రైనా, 2020 ఒక్క సీజన్ కు దూరంగా ఉన్నాడు. గత సీజన్ లో ఆడిన రైనా 12 మ్యాచ్‌లలో కేవలం 160 రన్స్ చేశాడు. వచ్చే సీజన్ ఐపీఎల్ 2023లో అద్భుతమైన కమ్ బ్యాక్ చేస్తాడని  భావించిన ఫ్యాన్స్ కు రైనా మరోసారి షాకిచ్చాడు.