Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ప్రతిఘటన ఎదురవుతుండటంతో ఉత్తర కొరియా సాయం కోరారు. ఉత్తర కొరియా నుంచి రష్యా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నట్లు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. 


కిమ్ ఓకే


ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని రష్యా నిర్ణయించింది. ఇందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ఓకే చెప్పారు.


రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ వంటివి ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయంపై స్పష్టత లేదు. 


సుదీర్ఘ యుద్ధం


రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 6 నెలలు పూర్తయ్యాయి. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్లు ఫిబ్రవరి 24 ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఎవరైనా మధ్యలో తల దూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


ఆ రోజు నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ యుద్ధంలో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యాయి.


రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.


ఒంటరిగా





ఈ సైనిక చర్య కారణంగా రష్యా.. అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని యత్నించిన పుతిన్ సేనలకు ఉక్రెయిన్ చుక్కలు చూపించింది. పాశ్చాత్య దేశాల దన్నుతో ఉక్రెయిన్‌ ఇప్పటికీ దీటుగా పోరాడుతోంది. దీంతో పుతిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.




ఉక్రెయిన్‌ నెగ్గాలి


రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ అన్నారు. అందుకు ఐరోపా అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. మరోవైపు బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్.. తమకు అండగా ఉంటారని ఉక్రెయిన్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.


Also Read: Bengaluru Rains: హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు! 


Also Read: SC On Hijab Case: ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది- కానీ బడిలో ఉంటుందా?: సుప్రీం