Water Crisis in Bogota: కొలంబియా రాజధాని బొగొటలో (Bogota Water Crisis) నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. క్రమంగా నీటి వనరులు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల కరవు వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి అధికారులు నీటి కొరత సమస్యని తీర్చేందుకు కీలక సూచనలు చేశారు. జంటలు వేరువేరుగా కాకుండా కలిసి స్నానం చేయాలని కోరారు. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఈ సారి ఎప్పుడూ లేని స్థాయిలో నీటికి కరువొచ్చింది. రిజర్వాయర్‌లలో నీటి స్థాయులు తగ్గిపోతున్నాయి. వర్షాలు సరిగా పడని కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. ఈ సమస్య నుంచి (Water Crisis in Bogota) బయటపడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందిప్రభుత్వం. అందులో భాగంగానే జంటలు కలిసి స్నానం చేయాలంటూ సూచించింది. నీటిని పొదుపు చేసుకునేందుకు చేపడుతున్న చర్యల్లో ఇదీ ఒకటని అధికారులు వెల్లడించారు. ఇందులో మరే ఉద్దేశమూ లేదని వివరించారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులే ప్రస్తుత సమస్య నుంచి బయటపడడానికి తోడ్పడతాయని చెబుతున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల పాటు హైజీన్ లైఫ్‌కి కాస్త దూరంగా ఉండాలని, నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని నగర మేయర్ సూచించారు. కొన్ని చోట్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లనప్పుడు, సెలవు రోజుల్లో స్నానం చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం.
గతేడాది నుంచే ఎఫెక్ట్..
గతేడాది డిసెంబర్ నుంచే కొలంబియాలో ఎల్‌నినో ఎఫెక్ట్ మొదలైంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఫలితంగా కరవు వచ్చింది. అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. ఎండల తీవ్రతకి అడవులు చాలా చోట్ల తగలబడిపోయాయి. ఆ సమయంలోనే రిజర్వాయర్‌లలోని నీరంతా ఆవిరైపోయింది. బొగొటలోని 11 మున్సిపాలిటీల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. ఫలితంగా 90 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. బొగొట సిటీకి నీళ్లు అందించే మూడు రిజర్వాయర్‌లు ఎండిపోయాయి. ఇందులో 70% నీళ్లు ఉంటే సిటీ అంతా నీళ్లు అందుతాయి. ఇప్పుడు వీటిలో 16% మాత్రమే నీళ్లున్నాయి. 40 ఏళ్లలో ఇంత తక్కువ నీటి మట్టం నమోదైంది ఇప్పుడే అని అధికారులు తెలిపారు. ఒక్కనీటి చుక్కని కూడా వృథా చేయొద్దని సూచిస్తున్నారు. త్వరలోనే ఈ ఆంక్షలు ఎత్తివేస్తామని, కొద్ది రోజుల పాటు ప్రజలంతా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బెంగళూరులో ఇలా..
ఇటు భారత్‌లోని కీలక నగరమైన బెంగళూరులోనూ (Bengaluru Water Crisis) దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు నగర ప్రజలు. వాటర్ ట్యాంకర్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో స్నానం చేస్తున్నారు. ఇంట్లో వంట పాత్రలకు బదులుగా డిస్పోజబుల్ ప్లేట్‌లు, స్పూన్‌లు వాడుతున్నారు. ప్రభుత్వం కూడా నీటి సమస్యని తీర్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేల జరిమానా విధిస్తోంది.