Coronavirus In Delhi:


అసింప్టమేటిక్‌..? 


పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం అన్ని విమానాశ్రయాల సిబ్బందిని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎవరిలో కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే క్వారంటైన్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు భారీ సంఖ్యలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే 13 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా సోకిందేమో అన్న అనుమానం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన వెంటనే వాళ్ల వైరస్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ 13 మంది ప్రయాణికులు రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్లు. వీళ్లను అసింప్టమేటిక్‌గా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఎవరినీ వదలకుండా నిత్యం టెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. వీటితో పాటు ప్రతి ఒక్క ప్రయాణికుడు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. కరోనా బాధితుల సంఖ్య పెరిగితే ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించారు. సోమవారం ఇదే ఎయిర్‌ పోర్ట్‌లో 11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా అదుపులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ ఆరోగ్య విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే... గత 24 గంటల్లో 16 మందికి కరోనా సోకింది. పాజిటివిటీ రేటు 0.44%గా నమోదైంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కేసుల సంఖ్య 39కి పెరిగింది. ఇటీవలే ముగ్గురు కరోనా బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగానూ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. రోజుకు 200 కన్నా తక్కువ కేసులే నమోదవుతున్నాయి. 


తమిళనాడులోనూ...


తమిళనాడులో కరోనా కలకలం రేపింది. చైనా నుంచి కొలంబో మీదుగా తిరిగి వచ్చిన ఒక మహిళ,ఆమె ఆరేళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో వీళ్లకు కొవిడ్-19 పరీక్ష చేశారు. మధురై సమీపంలోని విరుదునగర్‌కు చెందిన మహిళ, 
ఆమె కుమార్తెకు మంగళవారం ల్యాండ్‌ అయినప్పుడు విమానాశ్రయంలో RT-PCR పరీక్షను నిర్వహించారు. ఫలితాల్లో కరోనాకు పాజిటివ్‌గా తేలినట్లు అధికారి తెలిపారు. వీరిద్దరూ విరుదునగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జినోమిక్ సీక్వెన్సింగ్ కోసం వారి నమూనాలను ల్యాబ్‌కు పంపనున్నారు. తమిళనాడులో మంగళవారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 51 వద్ద ఉంది. చైనాలో అకస్మాత్తుగా కరోనా వైరస్ కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాలకు వచ్చిన ప్రయాణికులపై నిఘా పెట్టింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉన్న వేరియంట్‌లను పర్యవేక్షించడానికి, కొత్త వేరియంట్‌లను గుర్తించడానికి జినోమిక్ సీక్వెన్సింగ్ (డబ్ల్యుూజీఎస్) కోసం కొవిడ్-19-పాజిటివ్ నమూనాలను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.


Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? బూస్టర్‌ డోస్ వేసుకున్న వాళ్లకూ ఇది అవసరమా?