Nagar kurnool News: తాను తల్లి కాబోతున్నట్లు తెలిసినప్పటి నుంచి కడుపులో ఉన్న బిడ్డ గురించి అనేక కలలు కనింది. రోజులు, నెలలు ఆ బిడ్డ కోసమే ఆలోచిస్తూ తనలో తానే మురిసిపోయింది. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆనందం ఓ వైపు ప్రసవ వేదన ఎలా ఉంటుందోనన్న భయం మరోవైపు. అయినా సరే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎంత కష్టమైనా పడాలనుకుంది.


తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. పంటి బిగువున నొప్పి అదిమి పెట్టి ధైర్యంగా ఆస్పత్రికి బయలు దేరింది.  కాన్పు క్లిష్టమయ్యేలా ఉందని అక్కడి వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వాళ్లు మరో ఆస్పత్రిని, అక్కడికి చేరాకా వాళ్లు ఇంకో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఇలా మొత్తం ఐదు ఆస్పత్రులకు తీసుకెళ్లగా... సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బిడ్డను ప్రసవించిన కాసేపటికే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు. 


అసలేం జరిగిందంటే..?


నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఎల్మపల్లికి చెందిన 24 ఏళ్ల చారగొండ స్వర్ణ నిండు గర్భిణీ. మొదటి కాన్పు కావడంతో పదర మండలం వంకేశ్వరంలోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు 108 అంబులెన్స్ ద్వారా 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న పదర హీహెచ్సీ కి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి ప్రసవం క్లిష్టమయ్యేలా ఉందని చెప్పారు. 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి వైద్య సిబ్బంది కూడా తమ వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అయితే అక్కడ ప్రాథమిక వైద్య సేవలు అందించిన సిబ్బంది.. బీపీ అదుపులోకి రాకపోవడంతో మరో 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. 


అక్కడ కూడా ఆమె పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరో 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకు వెళ్లమని చెప్పారు. ఇక చేసేదేం లేక ప్రసవ వేదనతో కన్నీళ్లు పెడుతున్న కూతురును అక్కడి నుంచి మహబూబ్ నగర్ దవాఖానకు తరలించారు. రాత్రి రెండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. వెంటనే వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె కుమారుడికి జన్మనిచ్చిన అనంతరం ఫిట్స్ వచ్చి స్వర్ణ మృతి చెందింది. మరికాసేపటికే శిశువు కూడా చనిపోయింది. కాన్పు కోసం కష్టపడి 124 కిలో మీటర్ల దూరం వెళ్లినా తల్లీబిడ్డలు దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయిదు ఆస్పత్రులు తిరిగినా సరైన సౌకర్యాలు లేకే తల్లీబిడ్డ మృతి చెందారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 


అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన కాన్పులు చేసేందుకు అసరమైన పరికరాలు, వసతులు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి కేసులను వేరే ఆస్పత్రులకు పంపిస్తున్నామని అమ్రాబాద్ వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ కూడా ఇక్కడ అందుబాటులో లేదని చెప్పారు. ప్రత్యేక వైద్యులు కూడా లేరని వివరించారు. స్వర్ణను ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమెకు హైబీపీ ఉందని చెప్పారు. కాన్పు కష్టమయ్యే అవకాశం ఉండడం వల్ల ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అమ్రాబాద్ లో కేవలం సాధారణ కాన్పులు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ నాగరాజు వివరించారు.