Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ గహ్లోత్ అధ్యక్ష బరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు భారత్ జోడో యాత్రలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను వెంటనే దిల్లీకి రావాలని సోనియా గాంధీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


దీంతో ఆయన జోడో యాత్ర నుంచి బ్రేక్ తీసుకుని దిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.






సై అంటే సై


మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఓ వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ నిర్ణయించుకున్నారు.


ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని థరూర్ ఆమె ముందు ఉంచగా.. "మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు" అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 


అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్‌ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు చేపట్టాలని థరూర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.  


గహ్లోత్


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ కూడా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెప్టెంబర్ 26న ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 30 తుది గడువు. అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. ఒక వేళ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో గహ్లోత్ నెగ్గితే రాజస్థాన్ సీఎం పగ్గాలు సచిన్‌ పైలట్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.


Also Read: Union Minister Narayan Rane: కేంద్రమంత్రి రాణెకు షాక్- అక్రమ నిర్మాణంపై భారీ ఫైన్!


Also Read: Pilot Dies In Jet Crash: ఎయిర్‌ రేస్‌లో కుప్పకూలిన జెట్ విమానం- పైలట్ మృతి!