Congress President Election: 


గెహ్లోట్ వర్సెస్ శశిథరూర్..? 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఎన్నో రోజులుగా మేథోమధనం కొనసాగిస్తోంది అధిష్ఠానం. మొత్తానికి నామినేషన్ తేదీ వచ్చేసింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 30 వ తేదీ వరకూ నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. పార్టీ సీనియర్ నేతలు కొందరు ఈ రేసులో ఉన్నారు. అయితే..వీరిలో ముఖ్యంగా వినిపించే పేర్లు మాత్రం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌వే. ఇటీవలే ఈ ఇద్దరు నేతలు సోనియా గాంధీని కలిశారు. అధ్యక్ష ఎన్నికల్లో 
పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కూడా కలిశారు అశోక్ గెహ్లోట్. పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని రాహుల్‌ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ...అందుకు రాహుల్ అంగీకరించలేదు. ఫలితంగా...తానూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు గెహ్లోట్ ప్రకటించారు. ఈ మొత్తం సినారియోలో సోనియా గాంధీ "న్యూట్రల్‌"గా ఉంటానని స్పష్టం చేశారు. గెహ్లోట్, శశిథరూర్‌తో పాటు..మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


అక్టోబర్ 17న ఎన్నిక


సెప్టెంబర్ 22వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ ప్రక్రియ ఇవాళ మొదలైంది. 30 వతేదీ వరకూ కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వాళ్లు ఈ గడువులోగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ లీడర్ మధుసూదన్ మిస్త్రీ...ఈ ఎన్నికను పర్యవేక్షిస్తారు. అక్టోబర్ 8వ తేదీ వరకూ నామినేషన్ ఉపసంహరించుకోటానికి అవకాశముంటుంది. అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. కనీసం ఇద్దరు ఈ పదవికి పోటీ పడితేనే ఓటింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఒక్కరు మాత్రమే పోటీ చేస్తే...పార్టీ అధిష్ఠానం చర్చించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. 


సందిగ్ధం వీడుతుందా..?


కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరి చేపడతారన్న ప్రశ్న కొంత కాలంగా సందిగ్ధంలోనే ఉంది. రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవటం, వరుసగా పలువురు సీనియర్లు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవటం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు సరైన సారథి ఎంతో అవసరం. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి...గెలిచిన వారికి ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు సోనియా గాంధీ. ఇప్పటికే ఆమె సీనియర్లను ఒప్పించే ప్రయత్నాలు కూడా మెదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చిన పేరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్. గతంలో సోనియా...గెహ్లోట్‌ను అధ్యక్షుడిగా ఉండాలని కోరినా...అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓకే అన్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన గెహ్లోట్...పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే సంకేతాలిచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్నానని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలుస్తోంది.