Electric SUV Space: భారత్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) స్పేస్‌లో మహీంద్ర గ్రూప్‌ (Mahindra Group) స్పీడ్‌ పెంచుతోంది. ఈ విభాగంలో కొత్త ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురావడం మీద ఫోకస్‌ పెంచింది.


రూ.4,000 కోట్ల పెట్టుబడి
ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌ ఉత్పత్తి కోసం, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో (British International Investment- BII) కలిసి ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తోంది. 500 మిలియన్ అమెరికన్‌ డాలర్ల (రూ.4,000 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. 


ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ 'ఈవీ కో' (EV Co) కోసం 250 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని గతంలోనే బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రకటించింది.


ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, కొత్త ఎలక్ట్రిక్ వెహికల్‌ కంపెనీలో ఉత్పత్తుల కోసం FY24-FY27 మధ్య కాలంలో మొత్తం 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని దశలవారీగా చొప్పిస్తూ వెళతాయి.


తన మొదటి ఎలక్ట్రిక్ SUV మోడల్‌ అయిన XUV 400ను వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్ల మీదకు తెస్తామని ఈ నెల ప్రారంభంలో మహీంద్ర & మహీంద్ర వెల్లడించింది.


ఐదు ఎలక్ట్రిక్ SUVలు
దేశీయ & అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఐదు ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేయనున్నట్లు గత నెలలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో (UK) జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇండియన్‌ ఆటో మేజర్‌ ప్రకటించింది.


ఈ ఐదు ఎలక్ట్రిక్ SUV మోడళ్లను XUV, BE (ఆల్ న్యూ ఎలక్ట్రిక్ ఓన్లీ) బ్రాండ్ల క్రింద మార్కెట్లకు పరిచయం చేయనున్నట్లు మహీంద్ర & మహీంద్ర తెలిపింది.


లెగసీ మోడళ్లను XUV బ్రాండ్ కింద, కొత్త ఎలక్ట్రిక్ మోడల్ BE బ్రాండ్‌ కింద కంపెనీ విడుదల చేస్తుంది.


70 శాతం మార్కెట్‌ వాటా
ప్రస్తుతం, మహీంద్ర & మహీంద్ర కంపెనీకి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో వెహికల్స్‌ లేవు. అయితే, దేశీయ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ (ఆటోలు) స్పేస్‌లో  70 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీదే అగ్రస్థానం.


2027 నాటికి తాను విక్రయించే SUVల్లో నాలుగింట ఒక వంతు ఎలక్ట్రిక్‌గా ఉంటుందని ఈ వాహన తయారీ సంస్థ అంచనా వేస్తోంది.


శుక్రవారం, మహీంద్ర & మహీంద్ర షేర్లు BSEలో 3 శాతం తగ్గి రూ.1,271.30 వద్ద ముగిశాయి. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ కేవలం రూ.3 పెరిగి ఫ్లాట్‌గా ఉంటే, గత ఆరు నెలల కాలంలో మాత్రం 66 శాతం ర్యాలీ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.