కృష్ణా జలాల వివాదంలో  మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తెలంగాణ సర్కార్ అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించి నీటిని  కరెంట్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని..   కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్టు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన కరెంట్ ఉత్పత్తి జీవోను రద్దు చేయాలని కోరారు.  ఏపీకి న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండికొడుతుందని ఏపీ సర్కార్ పిటిషన్‌లో ఆరోపించింది. ఈ పిటిషన్‌పై విచారణ ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాదనలు తాము వినిపించాయి. 


కేంద్ర ప్రభుత్వం..  ఇప్పటికే కృష్ణాబోర్డును నోటిఫై చేసినందున విచారణ అవసరం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. అయితే...  కేంద్రం జారి చేసిన గెజిట్ అక్టోబర్‌ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి...  అప్పటి వరకూ నీటిని నష్టపోవడానికి ఏపీ సిద్ధంగా లేదని.. తక్షణం గెజిట్ అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం మరో ధర్మాసనం ముందుకు రానుంది. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. అలాగే గతంలో కృష్ణా జలాల వివాదంలో వాదించానని గుర్తు చేసుకున్నారు.  మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు ప్రభుత్వాలకు సూచించాలని..   ఇరు రాష్ట్రాల  ఇరు రాష్ట్రాల సీనియర్‌ న్యాయవాదులకు సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. 


కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడంటే వర్షాలు, వరదలు పడి ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి కానీ.. అసలు వివాదం ప్రారంభమైనప్పుడు.. ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీ నీరు మాత్రమే ఉంది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం .. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయలేదన్న కారణాన్ని చూపుతూ.. తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చి మరీ.. అన్ని విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ కారణంగా ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయాయి. చాలా వరకు కృష్ణానీరు సముద్రం పాలయింది. అప్పట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని...  చాలా మంది సూచించినా... ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టునే ఆ తరహా సూచన చేసింది.  ముఖ్యమంత్రులు మాట్లాడుకోకపోయినా.. కనీసం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..!