CAA Implementation: దేశవ్యాప్తంగా ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని వెనక్కితీసుకునే ప్రసక్తే లేదని మోదీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియ మొదలైంది. పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకి గుజరాత్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. అహ్మదాబాద్‌లో ఉంటున్న 18 మంది హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించినట్టు గుజరాత్ హోంశాఖ వెల్లడించింది. హోం మంత్రి హర్ష్ సంఘ్వీ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ క్యాంప్ నిర్వహించారు. అక్కడే వాళ్లకి సిటిజన్‌షిప్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లోనే ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. 18 మందికి పౌరసత్వం కల్పించిన తరవాత హర్ష్ సంఘ్వీ వాళ్లతో మాట్లాడారు. దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. కొత్తగా భారత పౌరసత్వం లభించిన వాళ్లందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తుందని, వాళ్లకీ అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌లకు అధికారాలిచ్చారు. 2016,2018 గెజిట్ నోటిఫికేషన్‌ల ఆధారంగా ఈ అధికారాలు కల్పించారు. అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్‌ జిల్లా కలెక్టర్‌లు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ పాకిస్థాన్‌ నుంచి అహ్మదాబాద్‌లో ఉంటున్న హిందువుల్లో దాదాపు 1,167 మందికి భారత పౌరసత్వం లభించింది. 


"ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మైనార్టీల హక్కులపై ప్రత్యేక దృష్టి సారించారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై భారత్‌కి వలస వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా జరిగేలా చొరవ చూపించారు"


- హర్ష్ సంఘ్వీ, గుజరాత్ హోం మంత్రి


మార్చి 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం CAAని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ చట్టం ద్వారా ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని వెల్లడించింది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించనున్నట్టు తెలిపింది.