Brs Leaders Danam And Ranjith Reddy Joined in Congress: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బల తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్జి (Ranjith Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ.. వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదివారం ఉదయమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు, దానం నాగేందర్ ఇటీవలే సీఎం రేవంత్ ను కలిశారు. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని.. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.






కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా..


ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలను హస్తం పార్టీలో చేరేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచే బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, ఆమెను మల్కాజిగిరి నుంచి బరిలో నిలపాలనే యోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018లో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల సీఎం రేవంత్ ను కలిసిన దానం.. ప్రజల, నియోజకవర్గం సమస్యలు వివరించేందుకే ఆయన్ను కలిశానని.. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే, అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే, ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి భేటీ అయ్యారు.


బీఆర్ఎస్ కు ఐదుగురు ఎంపీలు గుడ్ బై


తెలంగాణలో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో, బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.


Also Read: Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే - రెండ్రోజుల్లోనే ట్విస్ట్!