Chittoor Crime News: బాలికలపై రోజు రోజుకీ అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. పసి ప్రాయంలో ఉన్న బాలికలపై కన్నేసి లైంగిక దాడులకు పాల్పడుతూ కొందరు కామాంధులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా కంటికి రెప్పల కాపాడాల్సిన ఓ బాబాయి.. సొంత అన్న కుమార్తెను బెదిరించి గర్భవతిని చేసిన దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తుల సహాయంతో నిందుతుడిని కరెంట్ స్ధంభానికి కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగిందంటే?
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంట గ్రామానికి చెందిన నాగారాజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నాగరాజుకి ఇది వరకే వివాహం జరిగింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాగరాజు భార్య గర్భవతి కావడంతో తన అన్న కుమార్తె ఈ బాలికపై కన్నేశాడు. బాలికను లొంగ దీసుకునేందుకు ప్రణాళికలు రచించాడు. తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం రోజు స్కూల్ కి వెళ్లే సమయంలో చిరుతిళ్లు కొని ఇచ్చేవాడు. బాలికను స్కూల్ నుంచి తీసుకుని వచ్చి ఇంటి వద్ద వదిలేవాడు. సొంత బాబాయే కావడంతో బాలిక కూడా బాబాయితో చనువుగానే ఉండేది. నాగారాజు వక్రబుద్దిని ఆ బాలిక గ్రహించలేక పోయింది. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నాగారాజు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే ఈ విషయం అమ్మా, నాన్నలకు చెప్తే వాళ్లను ఎక్కడ చంపేస్తాడోనని భయపడిని పాప.. ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. ఇదే అదునుగా తీసుకున్న నాగరాజు బాలికను భయపెడుతూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి బాలికపై లైంగక దాడికి పాల్పడేవాడు.
తరచుగా లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చిన బాలిక
ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు బాలికను చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే రోజు రోజుకి బాలిక శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించి తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. దీంతో పరీక్షించిన వైద్యులు బాలిక ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో తల్లి అక్కడే కుప్పకూలిపోయింది. ఇంత చిన్న పిల్ల తల్లి కావడం ఏంటని గుండెలవిసేలా రోదించింది. వెంటనే విషయాన్ని తన భర్తకు చెప్పింది. బాలికను ఇంటికి తీసుకు వచ్చి.. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి అడగ్గా అసలు విషయం చెప్పింది బాలిక. ఈ క్రమంలోనే గ్రామస్థుల సాయంతో భార్యాభర్తలిద్దరూ నిందితుడిని పట్టుకొని విపరీతంగా కొట్టారు. కరెంటు స్తంభానికి కట్టేసి మరీ గ్రామస్థులంతా దాడి చేశారు. అనంతరం నిందుతుడిని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకూ పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు.. నిందుతుడిని రిమాండ్ కి తరలించారు. అయితే గతంలోనూ నాగరాజు గ్రామంలో మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పలుమార్లు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.