దేశం భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న ముప్పులు, సవాళ్లకు సంబంధించిన ట్రైలర్లు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే అన్నారు. చైనా, పాకిస్థాన్ వల్ల జాతీయ భద్రతకు ఎదురవుతోన్న సవాళ్లపై ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
భవిష్యత్ వివాదాలు, ముప్పులకు సంబంధించిన ట్రైలర్లను మనం ఇప్పుడు చూస్తున్నాం. యుద్ధ భూమి నుంచి సైబర్ నేరాల వరకు ప్రతిరోజూ భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోంటోంది. వివాదాస్పద సరిహద్దుల్లో కూడా భారత్ ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. - ఎంఎం నరవాణే, భారత సైన్యాధిపతి
అదే పెద్ద సవాల్..
ప్రస్తుతం భారత్ భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని నరవాణే అన్నారు. ఉత్తర సరిహద్దులో జరుగుతోన్న పరణామాలు.. భారత బలగాలను అప్రమత్తమయ్యేలా చేశాయన్నారు. చైనా, పాకిస్థాన్ పేర్లను ఎత్తకపోయినా అణ్వాయుధాలు కలిగిన దేశాలు పక్కన మనం ఉన్నామని.. దానికి తోడూ పరోక్ష యుద్ధాలు చేసే కుటిల నీతి వారి సొంతమని నరవాణే వ్యాఖ్యానించారు.
2020లో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణను కూడా నరవాణే ప్రస్తావించారు. వివాదాస్పద ప్రదేశాల్లో ఒప్పందాలకు తూట్లు పొడిచి ఆక్రమణలు చేయడం సరైన విధానం కాదన్నారు. వీటి వల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు వాతావరణం నెలకొంటుందన్నారు.