మీ క్రూరత్వం గురించి విన్నాం..! కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం! అవును.. ఈ మాటలు ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా తప్పదు చెప్పమంటారా? అదే ది గ్రేట్ చైనా.
ప్రపంచంలో నం.1 దేశంగా ఎదగడానికి చైనా చేసే పనులు అందరికీ తెలిసిందే. అయితే అందుకు కొవిడ్, ఒమిక్రాన్ మహమ్మారులు అడ్డొస్తే.. మిగిలిన దేశాలైతే వాటితో పోరాడుతున్నాయి. మాస్కులు, కరోనా నిబంధనలు అంటూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కానీ చైనా ఏం చేస్తుందో తెలుసా. కరోనా ఉందని అనుమానం వచ్చినా సరే.. తీసుకెళ్లి బోనులో పడేస్తోంది. అవును.. షాకింక్‌గా అనిపించినా ఇది నిజం.
మెటల్ బోన్లు..
ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా కొన్ని మెటల్ బాక్సులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడైనా ఒక్క కరోనా కేసు వస్తే ఆ ప్రాంతంలో ఉన్నవారినంతా అధికారులు బలవంతంగా ఈ మెటల్ బాక్సుల్లో నిర్బంధిస్తున్నారు. దీన్నే జీరో కొవిడ్ వ్యూహంగా డ్రాగన్ పిలుస్తోంది. అనుమానం ఉంటేనే ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చూశారా?
చైనాలోని అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్, అన్యాంగ్ ప్రాంతాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో డ్రాగన్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
నిర్దాక్షిణ్యం..
గర్భిణులు, వృద్ధులు, చిన్న పిల్లలు కూడా రెండు వారాల పాటు ఈ బాక్సుల్లో ఉండాల్సిందే. ఇందులో ఒక చెక్కతో తయారు చేసిన బెడ్, మరుగుదొడ్డి ఉంటాయి. తల మాత్రమే బయటకు పెట్టి రోజువారీ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఒక కిటికీ ఉంటుంది.
ప్రపంచానికి ఇవన్నీ తెలియకూడదని చైనా వీటిని రహస్యంగా చేస్తోంది. ప్రజలను అర్ధారాత్రి తరలించేందుకు క్యూలైన్లలో ఉన్న బస్సులు, చిన్నారులకు పీపీఈ కిట్లు వేసి తరలిస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతున్నందున వైరస్‌ను కట్టడి చేసేందుకే చైనా ఈ ఆంక్షలు అమలు చేస్తోంది.