Chandrayaan In School Syllubus: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్‌-3 ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్రకెక్కింది. అయితే ఈ అద్భుతమైన ప్రాజెక్టు వివరాలు ఇక ఉత్తరాఖండ్‌ స్కూల్‌ సిలబస్‌లో భాగం కానుంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ విద్యా శాఖ మంత్రి ధాన్‌ సింగ్‌ రావత్‌ వెల్లడించారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికత గురించి అవగాహన పెంచడంతో పాటు ఇలాంటి గొప్ప విజయాల వెనుక దేశ ప్రతిష్ఠ ఉంటుందనే అంశాన్ని తెలియజెప్పడానికి చంద్రయాన్‌ ౩ను సిలబస్‌ చేర్చుతున్నట్లు చెప్పారు. 


చంద్రయాన్‌ ౩ మిషన్‌ విజయవంతం అవ్వడం దేశాన్ని గర్వించేలా చేసిందని, అలాగే భారతదేశ శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేసిందని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు ఇది బాగా తోడ్పడుతుందని రావత్‌ వెల్లడించారు. ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు పాఠశాల సిలబస్‌లో చంద్రయాన్‌ మిషన్‌ గురించి వివరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. చంద్రయాన్‌ 1, చంద్రయాన్‌ 2, చంద్రయాన్‌ 3 మిషన్లకు సంబంధించిన అంశాలను  సిలబస్‌ లో చేర్చుతామని తెలిపారు. ఇందులో ఇస్రో కృషి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని అన్నారు. ఇది విద్యార్థులలో సెన్స్‌ ఆఫ్‌ ప్రైడ్‌ పెరుగుతుందని, శాస్త్రీయ రంగం వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. అలాగే రానున్న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ ఏడాది వరదల వల్ల నష్టపోయిన పాఠశాలలను పునరుద్ధరించేందుకు కాంటిజెన్సీ నిధులను వాడుకోవాలని అధికారులకు సూచించారు.


తమిళనాడులోనూ..


వచ్చే విద్యాసంవత్సరం నుంచి విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవం చేరుకున్న చంద్రయాన్‌ -3 ప్రాజెక్టు గురించి పాఠ్య పుస్తకాలలో చేర్చుతామని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సిలబస్‌లో ఈ ప్రాజెక్టు గురించి చేర్చడానికి విద్యా శాఖ తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చంద్రయాన్‌ మిషన్‌లోని ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారై ఉండడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. వారి ప్రతిభను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు గురించి పాఠ్యాంశంగా రూపొందించడంపై విద్యాశాఖ నిపుణులతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.