స్టవ్ మీద టీ మరుగుతుంటేనే ఇల్లంతా ఆ వాసన గుభాళిస్తుంది. ఎప్పుడెప్పుడు టీ తాగేద్దామా అనిపిస్తుంది. తేనీటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఉదయం లేస్తూనే టీ తాగనిదే ఏ పనీ చేయనివారు లక్షల్లో ఉండడం ఖాయం. సాధారణంగా మనం తాగే టీ పొడి కిలో 600 రూపాయల లోపే వచ్చేస్తుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి ఒకటి ఉంది. దీన్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. కేవలం కోటీశ్వరులు మాత్రమే ఈ టీ పొడిని కొని టేస్ట్ చూడగలరు. ఎందుకంటే ఈ టీ పొడి ఖరీదు కిలో 10 కోట్ల రూపాయలు. అంటే 100 గ్రాముల టీ పొడి కొనాలంటే కోటి రూపాయలు చెల్లించాలి. అంత స్తోమత ఎంతమందికి ఉందో అందరికీ తెలిసిందే. ఈ టీ పొడి పేరు డా హాంగ్ పావ్ కేవలం చైనాలో మాత్రమే దొరుకుతుంది.


చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ తేయాకు మొక్కలు పెరుగుతాయి. ఇవి చాలా అరుదైన మొక్కలు. వీటిని పెంచాలంటే చాలా ప్రత్యేక పద్ధతులు అవసరం. ఈ మొక్కల ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రోగాలను ఇవి నయం చేయగలవు.  అందుకే ఈ తేయాకుకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ఈ తేయాకు వెనక ఒక ప్రాచీన కథ కూడా చైనాలో చెప్పుకుంటూ ఉంటారు. చైనాను మింగ్ వంశానికి చెందినవారు పాలించిన సంగతి తెలిసిందే. ఆ వంశంలోని ఒక రాణి ఆరోగ్యం బాగాలేక మంచం పట్టింది. రాణి అలా అనారోగ్యంతో మంచం పట్టడంతో రాజు కూడా మానసిక బాధతో రోగిలా మారిపోయాడు. అప్పుడు రాజ్యంలోని ప్రముఖ వైద్యులు డా హాంగ్ పావ్ మొక్కల ఆకులతో వైద్యం చేశారు. కొన్ని రోజులకు రాణి ఆరోగ్యం కుదురు పడింది. రాణి ఆరోగ్యం బాగవడంతో రాజుగారు కూడా ఆరోగ్యవంతులు అయ్యారు. ఇలా అద్భుత ఔషధ గుణాలున్న పదార్థంగా పేరు తెచ్చుకుంది ఈ తేయాకు. అయితే అవి కాలక్రమేనా అంతరించిపోతూ వచ్చాయి. అతి కష్టం మీద ఈ మొక్కలను కాపాడుకుంటూ వస్తున్నారు.


అయితే ఇది చైనాలో ఎక్కడపడితే అక్కడ దొరకదు.  దీన్ని వేలం వేసినప్పుడు మాత్రమే వెళ్లి కొనుక్కోవాలి. చైనా ప్రభుత్వం ఈ తేయాకు తమ జాతీయ సంపదగా ప్రకటించింది. ఇది ఈ టీ పొడిని చైనా అధ్యక్షులు అప్పుడప్పుడు ఇతర దేశాల అధ్యక్షులకు బహుమతిగా అందిస్తారు. అది కూడా కేవలం 200 గ్రాములకు మించి ఇవ్వరు. 20 గ్రాముల విలువైన టీ పొడి కొనాలన్న మన రూపాయిల్లో 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఈ టీ పొడిని అందరూ టేస్ట్ చూసే అవకాశం లేదు. ఈ మొక్కలు కూడా అన్ని చోట్ల పెరగవు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లోని వాతావరణానికే ఇవి జీవిస్తాయి.


Also read: పచ్చి ఉల్లిపాయను తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.