గ్రామీణ ప్రాంతాల్లో మజ్జిగ అన్నంతో పాటు ఉల్లిపాయను నంజుకుని తినేవారు ఇప్పటికీ ఉన్నారు. ఇక నగరాల విషయానికొస్తే బిర్యానీ తో పాటు పక్కన ఉల్లిపాయలు ఉండాల్సిందే. బిర్యానీ తింటూ మధ్యలో పచ్చి ఉల్లిపాయను తింటేనే కొంతమందికి మజా వస్తుంది. నిజానికి పచ్చి ఉల్లిపాయను తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.నిజమే... ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పచ్చి ఉల్లిపాయను అధికంగా తింటే మాత్రం కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.


పచ్చి ఉల్లిపాయలు కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉండొచ్చు. ఇది మాంసాహారం పై కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల సాల్మొనల్లా  బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో చేరుతుంది. అక్కడ పేగులపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల పొట్ట నొప్పి, వికారం వంటివి వస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. పచ్చి ఉల్లిపాయను అధికంగా తింటే కడుపులో నొప్పి రావచ్చు. కాబట్టి ఎక్కువగా తినకపోవడమే ఉత్తమం. పచ్చి ఉల్లిపాయ వల్ల నోటి దుర్వాసన సమస్య పెరుగుతుంది. అలాగే ఎసిడిటీ కూడా వస్తుంది.


గర్భిణులు పచ్చి ఉల్లిపాయలు ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఎందుకంటే వారిలో వాంతులు, వికారం వంటి లక్షణాలను పచ్చి ఉల్లిపాయ పెంచుతుంది. అలాగే ఛాతిలో మంట పెట్టడం వంటివి కూడా జరగొచ్చు. కాబట్టి గర్భిణీలు పచ్చి ఉల్లిపాయను పూర్తిగా తినకపోతేనే ఉత్తమం. ఈ ఉల్లిపాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఉల్లిపాయలను అధికంగా తింటే ఈ పొటాషియం కాలేయానికి చెడు చేస్తుంది. కాలేయ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయ తినడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొంతమందిలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా రావచ్చు. అంతేకాదు ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.


పచ్చి ఉల్లిపాయ ప్రతిరోజూ తింటేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు తింటే పచ్చి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి రసాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు పట్టుకురుల్లా మెరుస్తుంది. అంతేకాదు చుండ్రు వంటివి కూడా తగ్గుతాయి. జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయనే తినాల్సిన అవసరం లేదు. వండిన ఉల్లిపాయ వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో యాంటీ అలెర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారు ఉల్లిపాయలతో వండిన ఆహారాలను అధికంగా తింటే ఎంతో ఉత్తమం.  


Also read: కాల్చిన వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు


Also read: బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిదేనా? ఇది తింటే సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా?

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.