NEET AND NET EXAMS NEET and NET పేపర్ లీకుల ఆరోపణలతో నీట్, నెట్ పరీక్షలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు  సూచనలు కోరుతూ కేంద్రం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ (NEET - UG) అనేది  దేశ వ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు జరిగే ఎంట్రన్స్ టెస్టు.  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) అనేది ఇండియన్ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థుల అర్హతకు,  జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ ఇచ్చేందుకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించేందుకు జరిగే ఎంట్రన్స్ టెస్టు. ఈ రెండూ నెషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA)  ఆధ్వర్యంలో జరుగుతాయి.


నెట్, నీట్ పరీక్షలపై దుమారం 
ఈ రెండు ప్రతిష్టాత్మక పరీక్షల విషయంలో ఈ ఏడాది జరిగిన దుమారం అంతా ఇంతా కాదు. ఈ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నీట్  పరీక్షలో.. హరియాణాలోని ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంకు రావడంతో ఇద దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పరీక్షని రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపించింది. మరో వైపు  జీసీ నెట్ పరీక్ష సైతం విద్యార్థులు పరీక్ష రాసిన రెండో రోజు రద్దు కావడం తెలిసిందే. మంగళవారం పరీక్ష జరుగగా గురువారం రద్దయినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. గతంలో కంప్యూటర్ ఆధారంగా జరిగిన ఈ పరీక్ష ఈ సారి మాత్రం పెన్ను పేపర్ పై అంటే ఓఎంఆర్ షీట్ పై నిర్వహించారు. . ఈ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 9.8 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. కొత్తగా పరీక్ష తేదీని సైతం ప్రకటించకపోవడంతో వారంతా ఇప్పుటు ఆందోళనలో ఉన్నారు.


ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పరీక్షలను పారదర్శకంగా, సవ్యంగా, న్యాయంగా నిర్వహించడానికి  అవసరమైన సంస్కరణలు సూచించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.  ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్‌  నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం, పనితీరు, సమాచార భద్రత వంటి అంశాలపైనా ఈ కమిటీ సూచనలు చేస్తుంది.   






ఈ కమిటీలో ఎయిమ్స్‌ దిల్లీ మాజీ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ దిల్లీ డీన్‌ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ  జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.


ఈ కమిటీ రెండు నెలల్లోగా తన నివేదికను  సమర్పిస్తుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఇటీవల నీట్‌, నెట్‌ ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అవడం తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలోనే  కేంద్రం తాజాగా ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది.    దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే వీలుంది.