Telangana Crime news: ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. పోలీసులు డ్రగ్స్ కట్టడికి ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా  కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాల్లో నగరానికి తీసుకొస్తూనే ఉన్నారు.  పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా వ్యాపారస్తులను అంటగడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి  ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా సాయి చరణ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

  


నిందితుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు  వ్యాపారవేత్తలతో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం‌లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనూ సాయిచరణ్ ను డ్రగ్స్ కేసులో  డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాదాపు  50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా నెల్లూరు, విజయవాడ,  రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రాజేశ్వరి ట్రావెల్స్ , జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా సాయిచరణ్​ డ్రగ్స్ రవాణా చేస్తు్న్నాడని పోలీసులు వివరించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అహ్మదాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
అటు అహ్మదాబాద్ లోనూ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన తనిఖీల్లో రూ.3.5కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 - 24కు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.3,500 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల్లో డ్రగ్స్, బంగారం వాటా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే థానే పోలీసులు 25 ఏళ్ల నైజీరియన్ మహిళ నుండి సుమారు రూ. 5.6 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు.  గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి 56.3 గ్రాముల ఎండీ క్రిస్టల్ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 5.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.