choppadandi mla wife news: హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. చొప్పదండి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య మరణంతో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం కుంగిపోయారు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.


అయితే సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు కానీ, మేడిపల్లి సత్యంను పరామర్శించలేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శించారు. బిజీ షెడ్యూల్ ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఎం రేవంత్ రెడ్డిని చూడగానే ఎమ్మెల్యే సత్యం కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బాధను రేవంత్ రెడ్డితో చెప్పుకున్నారు. ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు కారణాలు, అసలేం జరిగిందో మేడిపల్లి సత్యంను అడిగి వివరాలు తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి.


కొంపల్లిలోని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. ఎమ్మెల్యే సత్యం ఇంటికి సీఎం రేవంత్ వెంట వెళ్లిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు.


అసలేం జరిగిందంటే.. 
ఆల్వాల్‌లోని పంచశీల కాలనీలో మేడిపల్లి సత్యం దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రూపాదేవి ఓ స్కూల్‌లో టీచర్‌గా చేస్తున్నారు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు భర్త, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గురువారం చొప్పదండికి వెళ్లగా సాయంత్రం భార్య ఫోన్ చే తనకు తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని, సూసైడ్  చేసుకొని చనిపోతున్నానని అన్నట్టు స్థానికంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాత్రి ఇంటికి వచ్చేలోగా భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యను అలా చూసిన కాంగ్రెస్ నేత సత్యం స్పృహతప్పి పడిపోగా,  ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.