Bangladesh Crisis News: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్రహోం మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీ బంగ్లాదేశ్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని, అక్కడి భారతీయుల భద్రతకు భరోసా కల్పించనుందని స్పష్టం చేశారు. హిందువులు, మైనార్టీల రక్షణకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. దాదాపు నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి.


జాబ్ కోటా సిస్టమ్‌పై తిరగబడిన విద్యార్థులు భద్రతా బలగాలపై దాడులు చేశారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడం వల్ల షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకి వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు. జమాతే ఇస్లామీ గ్రూప్ కావాలనే ఇదంతా చేస్తోందన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే వీళ్ల సేఫ్‌టీ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్ షా కీలక ప్రకటన చేశారు. (Also Read: Waqf Bill: వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు - కమిటీలో డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీ)


"బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. అక్కడి భారతీయుల భద్రతకు భరోసా ఇస్తుంది. అక్కడి హిందువులతో పాటు మిగతా మైనార్టీ కమ్యూనిటీలనూ రక్షించే బాధ్యతను ఈ కమిటీ తీసుకుంటుంది"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి






బంగ్లాదేశ్ హింసలో షేక్ హసీనా పార్టీ ఆవామీ లీగ్‌ నేతలెందరో చనిపోయారు. వాళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టి చంపారు ఆందోళనకారులు. హిందువుల ఆలయాలు, ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దాదాపు 27 జిల్లాల్లో ఈ హింస కొనసాగుతోంది. ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి మైనార్టీలపై దాడులను ఖండించారు. భారత్‌ అక్కడి అధికారులతో మాట్లాడుతోందని స్పష్టం చేశారు. ఇక ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. అక్కడి హిందువుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. 


Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన, ఆమీర్ ఖాన్ సమక్షంలో మూవీ చూడనున్న సీజేఐ