Kavitha will get bail next week : ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే బెయిల్ ప్రాసెస్ నడుస్తోందన్నని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కవిత జైల్లో 11కిలోల బరువు తగ్గారని, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. జైల్లో కవితకు బీపీ వచ్చింది... రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11వేల మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30వేల మందిని ఉంచారని కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు... కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్ లో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.
మార్చి పదిహేనో తేదీన కవితను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను మార్చి పదిహేనో తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పట్నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు. రెండు రోజుల కిందట చార్జిషీట్‌లో తప్పులు ఉన్నందున తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. కేటీఆర్, హరీష్ రావు గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి.. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి వచ్చారు.
శుక్రవారమే సిసోడియాకు బెయిల్ మంజూరు
పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు శుక్రవారమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయిందని చార్జిషీట్లు దాఖలు చేసినందున ఇక బెయిల్ కోసం నిందితులు దరఖాస్తులు చేసుకుంటే సానుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో సిసోడియాకు బెయిల్ రావడంతో. ఇతర నిందితుల్లోనూ ఆశలు చిగురించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కానీ... కానీ సీబీఐ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది.
మెడికల్ గ్రౌండ్స్ మీద కవితకు బెయిల్ వస్తుందా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేయడంతో అరెస్టయిన వారికి బెయిల్ రావడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. అప్రూవర్లుగా మారిన వారికి మాత్రమే ఇప్పటి వరకూ బెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు నిందితులకు బెయిల్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కవితకు మెడికల్ గ్రౌండ్స్ మీద అయినా బెయిల్ వస్తుందని కేటీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారని అనుకోవచ్చు.