Amit Shah Warning to Tealngana BJP Leaders: తెలంగాణలో (Telangana) లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా (Amit Shah) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపై భేటీలో చర్చించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా సమావేశం వాడీవేడీగా సాగినట్లు తెలుస్తోంది. 


కీలక నేతలకు వార్నింగ్


వర్గ విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా (Amit Shah) వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి అంతా సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చెయ్యొద్దని చెప్పారు. 'అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసింది. 30 సీట్లు వస్తాయని ఆశించినా ఫలితం కనబడలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఇది రిపీట్ కాకూడదు. లోక్ సభ ఎన్నికల్లో అంతా సమన్వయంతో పని చేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం కల్పిస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం.' అని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఓకే చెప్పిన నేపథ్యంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. అంతకు ముందు ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు. 


బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చ


బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపైనా అమిత్ షా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యేనే ఉంటే బాగుంటుదనే ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. అయితే, ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి రేసులో ఉండే అవకాశం ఉంది.


భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం


అనంతరం, అమిత్ షా నోవాటెల్ హోటల్ నుంచి ఛార్మినార్ వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.


Also Read: Formula E Car Race : ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా E రేసులపై సస్పెన్స్ - ప్రభుత్వం స్పందించడం లేదంటున్న నిర్వాహకులు !